గాజాలో మళ్లీ భీకర దాడులు.. ట్రంప్ శాంతి యత్నాలు కొనసాగుతున్నా ఆగని హింస

  • గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు
  • తాజా ఘటనలో 40 మంది పాలస్తీనియన్లు మృతి
  • 21 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో 58 వేలు దాటిన మృతులు
గాజా స్ట్రిప్‌లో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ భద్రతా దళాలు తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని, వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని స్థానిక ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. హమాస్‌ను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులను తీవ్రతరం చేసింది.

ఒకవైపు ఈ హింస కొనసాగుతుండగానే, మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 21 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందంపై సుదీర్ఘంగా చర్చించారు.

గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని, ఈ సమయంలో శాశ్వత శాంతి కోసం ప్రయత్నిస్తామని ట్రంప్ తెలిపారు. ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో తుది ప్రతిపాదన సిద్ధమవుతోందని, మిడిల్ఈస్ట్ శ్రేయస్సు కోసం హమాస్ దీనికి అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, గాజాపై యుద్ధాన్ని శాశ్వతంగా ఆపితేనే ఎలాంటి ఒప్పందానికైనా అంగీకరిస్తామని హమాస్ స్పష్టం చేసింది. దీంతో చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.

2023 అక్టోబర్‌లో హమాస్ జరిపిన దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించడంతో ఈ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతీకార దాడుల్లో ఇప్పటివరకు 58 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులై, తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. 


More Telugu News