Balaji Srinivasan: కొత్త దేశాన్ని నిర్మిస్తున్న భారత సంతతి వ్యాపారవేత్త... ఏకంగా దీవినే కొనేశాడు!

Balaji Srinivasan Building New Country Buys Island
షార్ట్స్‌లో చూడండి
భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికన్ టెక్ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ బాలాజీ శ్రీనివాసన్ ఓ అసాధారణ ప్రయోగానికి తెరలేపారు. టెక్నాలజీ నిపుణులు, ఆవిష్కర్తల కోసం ప్రత్యేకంగా ఒక కొత్త దేశాన్ని సృష్టించాలనే తన 'నెట్‌వర్క్ స్టేట్' కలను సాకారం చేసే దిశగా ఆయన తొలి అడుగు వేశారు. ఈ ప్రయోగంలో భాగంగా సింగపూర్ సమీపంలోని ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కొనుగోలు చేసి, అక్కడ 'నెట్‌వర్క్ స్కూల్' అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ స్కూల్, బాలాజీ ప్రతిపాదించిన 'నెట్‌వర్క్ స్టేట్' భావనకు ఒక నమూనాగా పనిచేస్తుంది. ఆన్‌లైన్‌లో ఒకే రకమైన ఆశయాలు, విలువలు కలిగిన వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పడి, ఆ తర్వాత భౌతికంగా భూభాగాన్ని సంపాదించుకుని, ప్రపంచ గుర్తింపుతో ఒక సార్వభౌమ దేశంగా ఎదగాలన్నదే ఆయన ఆలోచన. ఈ ఆలోచనను తన 'ది నెట్‌వర్క్ స్టేట్' పుస్తకంలో ఆయన  వివరించారు.

ప్రస్తుతం ఈ ద్వీపంలో మూడు నెలల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ నడుస్తోంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బ్లాక్‌చెయిన్, స్టార్టప్స్ స్థాపించడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా, శారీరక దృఢత్వానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము బిట్‌కాయిన్ శక్తితో ఈ ద్వీపాన్ని కొనుగోలు చేశామని బాలాజీ శ్రీనివాసన్ స్వయంగా ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. కాయిన్‌బేస్‌కు మాజీ సీటీఓగా, పలు టెక్ కంపెనీల వ్యవస్థాపకుడిగా బాలాజీకి టెక్ ప్రపంచంలో మంచి పేరుంది. ఆయన చేపట్టిన ఈ కొత్త ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Go Back to Shorts
Balaji Srinivasan
Network State
Network School
cryptocurrency
private island
Singapore
startup
technology
digital nation
crypto

More Telugu News