తిరిగి తెరుచుకున్న పుల్వామా ఉగ్రవాదుల స్విమ్మింగ్ పూల్.. పాక్ బరితెగింపు చర్యలు

  • భారత్ ధ్వంసం చేసిన ఉగ్రవాద స్థావరాలను తిరిగి నిర్మిస్తున్న పాకిస్థాన్
  • గత నెలలో ‘ఆపరేషన్ సిందూర్’తో విరుచుకుపడిన భారత సైన్యం
  • పాక్ సైన్యం, ఐఎస్ఐ పూర్తి సహకారంతో ఉగ్ర శిబిరాల పునరుద్ధరణ
  • బహావల్‌పూర్‌లోని జైషే మహమ్మద్ స్విమ్మింగ్ పూల్ తిరిగి ప్రారంభం
  • నియంత్రణ రేఖ వెంబడి అడవుల్లో హైటెక్ టెర్రర్ క్యాంపుల ఏర్పాటు
  • భారత నిఘా నుంచి తప్పించుకోవడానికే కొత్త పన్నాగం
భారత సైన్యం జరిపిన మెరుపు దాడులతో తమ ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమైనా పాకిస్థాన్ బుద్ధి మారలేదు. దాడులు జరిగి నెల తిరగకముందే ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలను, లాంచ్‌ప్యాడ్‌లను తిరిగి నిర్మించే పనిలో నిమగ్నమైంది. పాక్ సైన్యం, గూఢచార సంస్థ ఐఎస్ఐ, ప్రభుత్వం అన్నీ కలిసికట్టుగా ఈ పునర్నిర్మాణ పనులకు పూర్తి మద్దతు ఇస్తున్నాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిప‌ణి దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో జైషే మహమ్మద్ (జేఈఎం) ప్రధాన కేంద్రమైన బహావల్‌పూర్‌తో పాటు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు పట్టున్న మురిద్కేలోని స్థావరాలు సహా మొత్తం తొమ్మిది ఉగ్ర కేంద్రాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మ్యాక్సార్ టెక్నాలజీస్ అందించిన ఉపగ్రహ చిత్రాలు కూడా ఈ విధ్వంసాన్ని ధ్రువీకరించాయి.

అయితే, ఈ దాడుల తర్వాత పాకిస్థాన్ తన ఉగ్రవాద విధానాలను మార్చుకుంటుందని భావించినా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి దట్టమైన అటవీ ప్రాంతాల్లో కొత్తగా చిన్నచిన్న, హైటెక్ ఉగ్రవాద సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. భారత నిఘా వ్యవస్థలు, దాడుల నుంచి తప్పించుకునేందుకే ఈ కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) వంటి సంస్థల కోసం ఈ కొత్త శిబిరాలను సిద్ధం చేస్తున్నారు.

పుల్వామా దాడి స్విమ్మింగ్ పూల్ మళ్లీ ఓపెన్
పాకిస్థాన్ బరితెగింపునకు నిదర్శనంగా బహావల్‌పూర్‌లోని జైషే మహమ్మద్ మదరసాలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను తిరిగి ప్రారంభించడం గమనార్హం. ఉగ్రవాదులకు శిక్షణలో భాగంగా ఈ స్విమ్మింగ్ పూల్‌ను వినియోగిస్తారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కూడా ఇక్కడే శిక్షణ పొందారు. దాడికి ముందు మహమ్మద్ ఉమర్ ఫరూఖ్, తల్హా రషీద్ అల్వీ సహా నలుగురు ప్రధాన ఉగ్రవాదులు ఇదే స్విమ్మింగ్ పూల్‌లో ఫొటోలు దిగారు. భారత్‌లోకి చొరబడటానికి ముందు ఉగ్రవాదులు ఈ స్విమ్మింగ్ టెస్టులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అలాంటి కీలకమైన శిక్షణా కేంద్రాన్ని భారత్ ధ్వంసం చేస్తే, నెల రోజులకే దాన్ని తిరిగి పునరుద్ధరించడం పాక్ ఉగ్రవాద వైఖరిని స్పష్టం చేస్తోంది.


More Telugu News