అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం?

  • ఎయిరిండియా విమాన ఘటనపై కుట్ర కోణంలోనూ దర్యాప్తు
  • విదేశాలకు బ్లాక్‌బాక్స్ పంపబోమని స్పష్టం చేసిన కేంద్రం
  • రెండు ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడం అరుదైన ఘటన అన్న మంత్రి
  • మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక వెల్లడి
  • దేశంలోని 33 డ్రీమ్‌లైనర్‌ విమానాలకు క్షుణ్ణంగా తనిఖీలు
  • డీజీసీఏలో 419 టెక్నికల్ పోస్టుల భర్తీకి చర్యలు
ఎయిరిండియాకు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్ లో దుర్ఘటనకు గురై 260 మంది మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ పై కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండే అవకాశాలున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్రం స్పందించింది. 

ఈ ఉదంతంలో కుట్ర కోణంపై కూడా దృష్టి సారించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ మోహోల్‌ వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తును ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) చేపట్టిందని, అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు. పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

విమానం నుంచి స్వాధీనం చేసుకున్న బ్లాక్‌బాక్స్‌ను విశ్లేషణ కోసం విదేశాలకు పంపుతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను మంత్రి మురళీధర్ పూర్తిగా ఖండించారు. "బ్లాక్‌బాక్స్‌ మన దేశంలోనే, దర్యాప్తు సంస్థల వద్దే సురక్షితంగా ఉంది. దానిని ఎక్కడికీ పంపే ప్రసక్తే లేదు" అని ఆయన తేల్చిచెప్పారు. ఇది చాలా విషాదకరమైన ఘటన అని, ఏఏఐబీ దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించిందని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించడంతో పాటు పలు ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు.

రెండు ఇంజిన్లు ఒకేసారి విఫలం కావడం అనేది అత్యంత అరుదైన విషయమని మంత్రి పేర్కొన్నారు. "ఇది చాలా ప్రత్యేకమైన కేసు. అసలు రెండు ఇంజిన్లు విఫలమయ్యాయా లేక ఇంధన సరఫరాలో ఏమైనా సమస్య తలెత్తిందా అనేది దర్యాప్తు నివేదిక వస్తేనే స్పష్టత వస్తుంది" అని ఆయన అన్నారు. బ్లాక్‌బాక్స్‌లోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో పైలట్ల సంభాషణలు నిక్షిప్తమై ఉంటాయని, దర్యాప్తులో అది కీలకం కానుందని తెలిపారు. మరో మూడు నెలల్లో నివేదిక వచ్చే అవకాశం ఉందని, కాబట్టి ఇప్పుడే దీనిపై ఏమీ మాట్లాడటం తొందరపాటు అవుతుందని మురళీధర్ అభిప్రాయపడ్డారు.

ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాల మేరకు దేశంలో వినియోగంలో ఉన్న మొత్తం 33 డ్రీమ్‌లైనర్‌ విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేశామని ఆయన చెప్పారు. ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారని భరోసా ఇచ్చారు.

అదే సమయంలో డీజీసీఏలో ఖాళీగా ఉన్న 419 సాంకేతిక సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మురళీధర్ వెల్లడించారు. ప్రైవేటు విమానయాన సంస్థలు తమంతట తాముగా నియామకాలు చేపట్టరాదని, డీజీసీఏ అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఎక్కువ గంటలు పనిచేయాలంటూ పైలట్లపై ఒత్తిడి తెచ్చే సంస్థల గురించి నేరుగా డీజీసీఏకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.


More Telugu News