మహారాష్ట్ర మహాయుతి కూటమిలో లుకలుకలు.. మంత్రుల సిబ్బందిపై సీఎం కొరడా

  • మంత్రుల పర్సనల్ సెక్రటరీలు, ఓఎస్‌డీల కొనసాగింపుపై ఫడ్నవీస్ ఆగ్రహం
  • ఆదేశాలు పాటించని ఆరుగురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ
  • శివసేన, ఎన్సీపీ మంత్రుల సిబ్బందిపై ప్రధానంగా దృష్టి
మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలోని లుకలుకలు మరోమారు బహిర్గతమయ్యాయి. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన కొందరు మంత్రులు తమ పర్సనల్ సెక్రటరీలు (పీఎస్‌లు), ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీలు)లను అనధికారికంగా కొనసాగించడంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు సిబ్బంది వాటిని బేఖాతరు చేయడంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురు సిబ్బందికి క్రమశిక్షణ చర్యల కింద నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామం కూటమిలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేయడంతో పాటు, ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రంగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. శివసేన మంత్రులు సంజయ్ రాథోడ్, శంభూరాజ్ దేశాయ్, భరత్ గొగావలే, గులాబ్ రావ్ పాటిల్ లతో పాటు ఎన్సీపీ నేతలు దత్తాత్రేయ భర్నే, ఛగన్ భుజ్‌బల్‌ల వద్ద పనిచేస్తున్న పీఎస్‌లు, ఓఎస్‌డీల నియామకాల విషయంలో ఈ వివాదం తలెత్తింది. వీరిలో కొందరు సహాయకుల నియామకాలు అక్రమాల ఆరోపణలతో నిలిచిపోయాయి. ఏళ్లుగా పదవుల్లో కొనసాగుతున్న ఈ సహాయకుల్లో పలువురిపై అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పదేపదే హెచ్చరికలు జారీ చేసినా, కొందరు పీఎస్‌లు, ఓఎస్‌డీలు తమకు నచ్చిన మంత్రుల వద్దే కొనసాగుతుండటంతో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కఠిన చర్యలకు ఉపక్రమించారు.

ఈ పరిణామం మహాయుతి కూటమిలో పెరుగుతున్న అసమ్మతికి నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివర్ మాట్లాడుతూ.. ఇది కేవలం పర్సనల్ సెక్రటరీల సమస్య కాదని, ఇది కూటమి భాగస్వాముల మధ్య సమన్వయ లోపం, పరస్పర నమ్మకం లేకపోవడాన్ని బహిర్గతం చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను బహిరంగంగా ధిక్కరిస్తున్నారంటే ఆయన నియంత్రణ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. 


More Telugu News