చంద్రబాబు, లోకేశ్ లను తొక్కిపెట్టి నార తీయాలి కదా?: పవన్ కల్యాణ్ కు రోజా ప్రశ్న

  • కూటమి ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు
  • మహిళల అక్రమ రవాణాపై పవన్ ఎందుకు స్పందించడం లేదని నిలదీత
  • ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే కూటమి గెలిచిందని వ్యాఖ్య
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా అంశంపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆమె సూటిగా ప్రశ్నించారు. తమ అధినేత జగన్ సభలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను అడ్డుకునేందుకే ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.

తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రోజా... కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన "సూపర్ సిక్స్" హామీలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. "పాలనను పక్కనపెట్టి దాడులు, అరాచకాలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు" అని రోజా పేర్కొన్నారు. ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు ఓడించలేదని, ఈవీఎంలలో జరిగిన గోల్‌మాల్ ద్వారానే ఆయన ఓటమిపాలయ్యారని ఆమె ఆరోపించారు. "అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది" అని రోజా వ్యాఖ్యానించారు.

మహిళల అక్రమ రవాణా అంశాన్ని ప్రస్తావిస్తూ... "మహిళల అక్రమ రవాణాపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా పవన్ కల్యాణ్. మరి ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ లను తొక్కిపెట్టి నార తీయాలి కదా?" అని ఆయనను ఉద్దేశించి ప్రశ్నించారు. వైఎస్ జగన్ నిర్వహించే సభలకు ప్రజలు పెద్దఎత్తున తరలిరాకుండా అడ్డుకోవాలనేది ప్రభుత్వ కుట్రలో భాగమేనని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని రోజా అభిప్రాయపడ్డారు. 


More Telugu News