ఫ్రాన్స్‌లో గుబాళిస్తున్న భారతీయ వంటకాలు.. అచ్చం మన ఊరి స్టైల్ భోజనం.. వీడియో వైరల్

  • ప్యారిస్‌లోని ఓ తమిళ రెస్టారెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • 'మునియాండి విలాస్' హోటల్‌లో భారతీయ రుచులు అద్భుతమంటూ వ్లాగర్ ప్రశంస
  • పరోటాలు చేస్తుంటే సొంత ఊరు గుర్తొచ్చిందన్న డిజిటల్ క్రియేటర్
  • చికెన్ బిర్యానీ, పరోటా రుచి అచ్చం మన దగ్గరిలాగే ఉందన్న వ్లాగర్
ప్రపంచవ్యాప్తంగా భారతీయ వంటకాలకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. మన దేశ రుచులు ఖండాంతరాలు దాటి విదేశీయుల మనసులను సైతం గెలుచుకుంటున్నాయి. తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉన్న ఓ తమిళ రెస్టారెంట్, భారతీయ ఆహార ప్రియుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళితే... జెగత్ విజయ్ (@jegathvijay) అనే ఓ డిజిటల్ క్రియేటర్ ఇటీవల ప్యారిస్‌లోని 'మునియాండి విలాస్' అనే తమిళ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ తన భోజన అనుభవాన్ని వివరిస్తూ ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను పంచుకున్నారు. దాంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారి, ఫుడ్ లవర్స్ మధ్య హాట్ టాపిక్‌గా నిలిచింది.

రెస్టారెంట్ బయట నుంచే లోపల వేడివేడిగా, పొరలు పొరలుగా పరోటాలు తయారుచేయడం స్పష్టంగా కనిపిస్తోందని వ్లాగర్ తన వీడియోలో చూపించారు. ఓ చెఫ్ ఎంతో నైపుణ్యంగా పరోటా పిండిని తిప్పుతూ, కాలుస్తూ ఉండటం ఆకట్టుకుంటుంది. "అది చూస్తుంటే, మన సొంత ఊరికి తిరిగి వెళ్లినట్లు అనిపించింది" అని విజయ్ వ్యాఖ్యానించారు. ఈ రెస్టారెంట్ మెనూలో దక్షిణాది వంటకాలతో పాటు శ్రీలంక వంటకాలు కూడా ఉన్నాయని తెలిపారు.

తాను అక్కడ చికెన్ బిర్యానీ, పరోటాను కూరతో కలిపి రుచి చూశానని విజయ్ చెప్పారు. మొదట్లో ఇవి నిజంగా మన ఊరి స్టైల్‌లో ఉంటాయా? లేదా? అనే సందేహం ఉండేదని, కానీ తిన్న తర్వాత అచ్చం మన ఇంట్లో తయారుచేసినంత అద్భుతంగా ఉన్నాయని ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

"లోపలికి అడుగుపెట్టగానే ఆ పరోటాల సువాసన నన్ను కట్టిపడేసింది. చెఫ్ వాటిని అంత బాగా చేస్తుంటే చూడగానే, ఇక్కడ మంచి భోజనం దొరుకుతుందని అర్థమైంది. వాళ్ల స్పెషల్ వంటకాన్ని ఆర్డర్ చేశాను. అలాగే చికెన్ బిర్యానీ కూడా ప్రయత్నించాను. నన్ను నమ్మండి, ఇది తప్పక సందర్శించాల్సిన ప్రదేశం" అని విజయ్ తన పోస్ట్ క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.

ఈ రీల్‌కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు తాము కూడా ఈ ప్యారిస్ రెస్టారెంట్‌లో తిన్నామని, ఆహారం చాలా బాగుందని కామెంట్ చేయగా, మరికొందరు మాత్రం అంత గొప్పగా ఏమీ లేదు అని అభిప్రాయపడ్డారు. అసలు విదేశాల్లో మన సంప్రదాయ రుచులను అంతే నాణ్యతతో అందించగలరా? అని మరికొందరు సందేహాలు వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ వీడియో భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను మరోసారి గుర్తు చేసింది.



More Telugu News