యువకుడి ప్రాణం తీసిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్​

  • మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ యువకుడు
  • జరిమానా కట్టకపోతే జైలుకు వెళతావని పోలీసుల హెచ్చరిక
  • భయాందోళనతో ఉరి వేసుకుని బలవన్మరణం
  • భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం
మద్యం సేవించి వాహనం నడుపుతూ ఓ యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరమని, కోర్టుకు హాజరై జరిమానా చెల్లించాలని పోలీసులు సూచించారు. దీంతో భయాందోళనకు గురైన యువకుడు ఇంటికి వెళ్లి ఉరివేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఇరుకు గోపి(25) ఏడాది క్రితం ఖమ్మం ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య కొత్తగూడెంలో నర్సింగ్‌ చదువుతుండడంతో పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల మద్యం తాగి బండి నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఈ నెల 19న పోలీసులు అతనికి ఫోన్‌ చేసి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాలని సూచించారు.

సమయానికి గోపి రాకపోవడంతో పోలీసులు మరోసారి ఫోన్ చేశారు. కోర్టుకు వచ్చి ఫైన్ కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన గోపి తన తండ్రికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఆ తరువాత భార్యను కళాశాల వద్ద దింపి ఇంటికి వచ్చి.. దూలానికి ఉరేసుకుని చనిపోయాడు. కాగా, తన భర్త మరణానికి ట్రాఫిక్ పోలీసులే కారణమని గోపి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.


More Telugu News