గోపన్‌పల్లి భూ వివాదం కేసు: సీఎం రేవంత్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు
  • కేసు కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తి
  • ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం
  • తీర్పును రిజర్వు చేస్తూ హైకోర్టు నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక కీలక కేసులో తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. 2016లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి 2020లో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.

రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలోని సర్వే నంబర్ 127లో ఉన్న 31 ఎకరాల భూమి హక్కుల విషయమై ఎస్సీ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డితో పాటు లక్ష్మయ్యలకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో, 2016లో సొసైటీకి చెందిన స్థలంలోకి కొందరు అక్రమంగా ప్రవేశించారని, అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే ఇది జరిగిందని సొసైటీ ప్రతినిధి ఎన్. పెద్దిరాజు ఆరోపించారు. తనను అడ్డుకున్నప్పుడు కులం పేరుతో దూషించారని ఆయన గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రేవంత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసును రద్దు చేయాలని అభ్యర్థిస్తూ రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఘటనా స్థలంలో రేవంత్ రెడ్డి లేరని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అప్పటి ప్రభుత్వం ఈ కేసు బనాయించిందని కోర్టుకు తెలిపారు.

మరోవైపు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదుదారుడైన పెద్దిరాజు 2014లోనే చందానగర్‌లో రేవంత్ రెడ్డిపై ఇలాంటిదే ఒక ఫిర్యాదు చేశారని, అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ కేసును కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. అనంతరం 2016లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పెద్దిరాజు మళ్లీ ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో విచారించిన 8 మంది సాక్షుల వాంగ్మూలాల ప్రకారం కూడా రేవంత్ రెడ్డి సంఘటనా స్థలంలో లేరని వారు చెప్పిన విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువర్గాల వాదనలు పూర్తి కావడంతో, హైకోర్టు ఈ పిటిషన్‌పై తన తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.


More Telugu News