టెహ్రాన్ ను వీడుతున్న జనం.. రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. వీడియో ఇదిగో!

  • ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రాణభయంతో జనం పరుగులు
  • ఇరాన్ రాజధానిలో ఇంధన కొరత, ఏటీఎంలపై ఆంక్షలు
  • కాస్పియన్ సముద్రం వైపు వెళ్లే రోడ్లపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ మరిన్ని వైమానిక దాడులకు పాల్పడవచ్చన్న భయంతో వేలాది మంది ప్రజలు నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. దీంతో నగరం నుంచి ఉత్తరం వైపు కాస్పియన్ సముద్రం తీరానికి వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది.

టెహ్రాన్‌లోని సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఇంధనంపై రేషన్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. అదే సమయంలో, ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాపై కూడా పరిమితులు విధించినట్లు సమాచారం.

నగరంలో నెలకొన్న భయానక వాతావరణం కారణంగా, చాలామంది ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారిగా జనాభా పెరిగినట్లు తెలుస్తోంది. సురక్షితమైన ఆశ్రయం కోసం ప్రజలు పడుతున్న ఆరాటం టెహ్రాన్ లోని నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. మొత్తం మీద, ఇరాన్‌లో ఇజ్రాయెల్ దాడుల భయంతో అనిశ్చిత వాతావరణం నెలకొంది.


More Telugu News