అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా 87 మృతదేహాల గుర్తింపు

  • అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతదేహాల గుర్తింపు
  • ఇప్పటి వరకూ 87 మృతదేహాలను గుర్తించిన అధికారులు
  • ఇప్పటికే 47 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగింత‌
అహ్మదాబాద్‌లో ఇటీవల‌ జరిగిన ఎయి‌ర్‌ ఇండియా విమాన ప్రమాదంలో చ‌నిపోయిన‌ వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకూ 87 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే 47 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

ఇక గుర్తించిన మిగతా మృతదేహాలను సైతం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ డెడ్‌ బాడీని అధికారులు డీఎన్‌ఏ పరీక్ష ద్వారా గుర్తించిన విషయం తెలిసిందే. 

మ‌రోవైపు, ఎయిర్ ఇండియా విమానానికి చెందిన కాక్‌పిట్ వాయిస్ రికార్డ‌ర్ దొర‌క‌డంతో ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. విమాన ప్ర‌మాదం ఎలా, ఎందుకు జ‌రిగింద‌న్న అంశాల‌ను తెలుసుకునేందుకు కాక్‌పిట్ వాయిస్ రికార్డ‌ర్ కీల‌కం కానుంది. ఫ్ల‌యిట్ డేటా రికార్డ‌ర్‌ను గుర్తించిన‌ట్లు ఇంత‌కుముందే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేష‌న్ బ్యూరో(ఏఏఐబీ) వెల్ల‌డించింది. 

ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘ‌ట‌న‌పై ఏఏఐబీ విస్తృత స్థాయిలో ద‌ర్యాప్తు చేప‌డుతోంది. అమెరికా నేష‌న‌ల్ ట్రాన్స్‌పోర్టేష‌న్ సేఫ్టీ బోర్డు కూడా ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ కొన‌సాగిస్తోంది. అలాగే ఎయిర్ ఇండియా విమానం.. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ‌ది కావ‌డంతో ఆ దేశం కూడా విచార‌ణ‌లో స‌హ‌క‌రిస్తోంది. 

బోయింగ్ కంపెనీకి చెందిన నిపుణులు కూడా ఈరోజు అహ్మ‌దాబాద్ చేరుకున్నారు. విమాన దుర్ఘ‌ట‌న‌పై వాళ్లు ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్నారు. కూలిన విమానం 787-8 డ్రీమ్‌లైన‌ర్ మోడ‌ల్ కావ‌డంతో బోయింగ్ సంస్థ ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర స్థాయిలో విచార‌ణ చేప‌ట్ట‌నుంది.


More Telugu News