అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా విమానం... విమానంలో 242 మంది ప్రయాణికులు!

Air India Plane Crash in Ahmedabad 242 Passengers Onboard
షార్ట్స్‌లో చూడండి
గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గురువారం ఒక పెను విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిరిండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి  కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటన స్థానిక మేఘాని నగర్‌ పరిధిలోని ఘోడాసర్‌ క్యాంప్‌ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరేందుకు సిద్ధమైన ఎయిరిండియా విమానం టేకాఫ్ ప్రక్రియలో ఉండగా ఈ దుర్ఘటన సంభవించింది. విమానం రన్‌వే పైనుంచి గాల్లోకి లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో విమానం అదుపుతప్పి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెప్పినట్లు సమాచారం.

ఈ ప్రమాద వార్త తెలియగానే విమానాశ్రయ అధికారులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ప్రయాణికుల పరిస్థితి ఏంటి అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ దుర్ఘటనలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంతమేరకు జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఘటనకు గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రయాణికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు.
Go Back to Shorts
Air India
Ahmedabad
Air India crash
Gujarat
Plane crash
London flight
Meghani Nagar
Ghodaasar camp
Ahmedabad airport

More Telugu News