Rayapati Shailaja: మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోం.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ

Rayapati Shailaja Demands Action Against Sakshi Media House
షార్ట్స్‌లో చూడండి
రాజకీయ నాయకుల అండతో నడిచే కొన్ని మీడియా సంస్థలు సమాజానికి అత్యంత ప్రమాదకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులు ఒక ప్రాంత మహిళలను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం వాడటంపై ఆమె తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న జర్నలిస్టులు ఇలాంటి అసత్య కథనాలను ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నించారు.

విషయాన్ని వివరిస్తూ, "గుంటూరులో 150 ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయని, అవి ఫీమేల్ సెక్స్ వర్కర్స్‌తో రిజిస్టర్ అయి పనిచేస్తున్నాయని ఓ జర్నలిస్టు అన్నారు. ఇది పూర్తిగా తప్పు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా ప్రకారం ప్రతి జిల్లాలో, ప్రతి ఊరిలో ఎంతమంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్జీఓలు వారితో పనిచేస్తున్నారనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఎవరో చేసిన స్టడీ ఆధారంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కోట్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక ప్రాంతం పేరు చెప్పలేదు, రాష్ట్రం గురించి మొత్తం చెప్పారు. కానీ వీళ్లు రాజకీయ కారణాలతో దాన్ని వాడుకుని ఒక ప్రాంత మహిళలను అవమానించడం చాలా తప్పు" అని శైలజ అన్నారు.

ప్రభుత్వాలు గానీ, ఎన్జీఓలు గానీ ఎవరైనా సరే, ఇంగ్లీషులో 'ప్రాస్టిట్యూట్స్' అనో, తెలుగులో 'వేశ్యలు' అనో ఎక్కడా వాడరని, 'సెక్స్ వర్కర్స్' అనే పదాన్నే ఉపయోగిస్తారని శైలజ స్పష్టం చేశారు. "అలాంటిది, మహిళలు, పిల్లలు చూసే ఒక పబ్లిక్ ఛానల్‌లో ఆ పదం వాడారంటే అది ఎంత అవమానకరం? అమరావతి ప్రాంత ఆడవాళ్లు ఏం పాపం చేశారు? ప్రభుత్వం అడిగితే రాజధాని కోసం భూములిచ్చారు, త్యాగం చేశారు. ఆ త్యాగానికి ప్రతిఫలంగా గత ఐదేళ్లలో వాళ్లు రోడ్లెక్కారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ, మహిళా కమిషన్ చుట్టూ తిరిగారు. ఎక్కడా న్యాయం జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు మారి, అమరావతి అభివృద్ధి దిశగా అడుగులేస్తుంటే ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ఎవరూ వాడని మాటలతో వాళ్లను కన్నీళ్లు పెట్టేలా చేశారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో మాట్లాడినా కొన్ని సెక్షన్లు వర్తిస్తాయని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే శిక్ష పడదని అనుకోవద్దని ఆమె హెచ్చరించారు. "మీడియా చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రజల పక్షాన నిలవాలి, ప్రభుత్వంలోని మంచి చెడులను ప్రజలకు చేరవేయాలి. అలా కాకుండా రాజకీయ నాయకుల నీడలో నడిచే ఛానళ్లు సమాజానికి చాలా ప్రమాదకరం. గతంలో రైతులను 'పెయిడ్ ఆర్టిస్టులు' అని కొన్ని మీడియా ఛానళ్లు అంటే, ఆ రైతులే నా మీదకు దాడికి వచ్చారంటూ ఒక జర్నలిస్ట్ రైతులపై కేసు పెట్టారు. రెచ్చగొట్టడం ఎందుకు, మళ్లీ వాళ్లపై కేసులు పెట్టడం ఎందుకు? పొరపాటు జరిగిందని చెప్పాలి కదా" అని శైలజ ప్రశ్నించారు.

ఈ విషయంలో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారని, డీజీపీకి  లేఖ రాయడం జరిగిందని తెలిపారు. "ఇది మళ్లీ పునరావృతం కాకుండా జాతీయ మహిళా కమిషన్‌కు కూడా లేఖ రాశాను. వాళ్లు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని, కేంద్ర ప్రభుత్వానికి లేదా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రాసి, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని కోరాను. అధికారాలను దుర్వినియోగం చేయకూడదు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రాసి, మీడియా ఛానల్ అండ చూసుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవారిపై, అవసరమైతే ఆ ఛానళ్లను మూసివేసే అధికారం కూడా ప్రెస్ కౌన్సిల్‌కు ఉంది, చర్యలు తీసుకోమని మేం సూచిస్తాం" అని శైలజ వివరించారు.

మహిళా కమిషన్‌కు నేరుగా అరెస్ట్ చేసే అధికారాలు లేవని, చట్ట ప్రకారం ఎస్పీ లేదా డీజీపీకి చర్యలు తీసుకోమని చెప్పగలమని అన్నారు. "మాకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా లేదా సుమోటోగా కేసు తీసుకుని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, ఫిర్యాదుదారులను పిలిపించి విచారించే అధికారం మాకుంది. ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నారో, వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో తెలుసుకుంటాం. వారు చెప్పిన దాంతో మేము సంతృప్తి చెందకపోతే, ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో చేశారని తేలితే, శిక్షార్హులని సంబంధిత అధికారులకు తెలియజేస్తాం" అని తెలిపారు.

ప్రస్తుతం ఈ కేసులో రెండో వ్యక్తికి, అలాగే సాక్షి మీడియా యాజమాన్యానికి, చీఫ్ ఎడిటర్‌కు సమన్లు సిద్ధమవుతున్నాయని శైలజ వెల్లడించారు. "నిజంగా మహిళల గురించి అంత కన్సర్న్ ఉంటే, 'మా ఛానల్ తప్పు చేసింది, క్షమాపణ కోరుతున్నాం' అని ఒక మాట చెప్పొచ్చు కదా? అది చేయకుండా, అసలు విషయం నుంచి దృష్టి మళ్లించడానికి ఇప్పుడు బయటకొచ్చి మాట్లాడుతున్నారు" అని ఆమె విమర్శించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకూడదని ఆమె స్పష్టం చేశారు.
Go Back to Shorts
Rayapati Shailaja
AP Women Commission
Andhra Pradesh
Amaravati
sex workers
media ethics
press council of india
Sakshi Media
Guntur
false reporting

More Telugu News