సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆశావహులు

  • తెలంగాణలో కేబినెట్ విస్తరణకు మూహూర్తం ఖరారు
  • నేడు కేబినెట్ లో కొత్తగా ముగ్గురికి చోటు !
  • సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎస్సీ మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు
తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మంత్రివర్గంలో తమ సామాజికవర్గానికి అవకాశం కల్పించాలని కోరుతూ ఎస్సీ మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.

వీరు అంతకు ముందే ఢిల్లీలో ఏఐసీసీ నేతలను కూడా కలిసి మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని విన్నవించారు. అనంతరం ఆ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు తిరిగి వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి తమ వినతిని వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఉన్నారు.

తెలంగాణ కేబినెట్‌లో ఇంకా ఆరుగురికి చోటు లభించే అవకాశం ఉండగా, నేడు ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహులు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఏఐసీసీ పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేశారు. 


More Telugu News