KSCA: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. కేఎస్‌సీఏ కార్యదర్శి, కోశాధికారి రాజీనామా

KSCA Officials Resign Following Bengaluru Chinnaswamy Stadium Incident
షార్ట్స్‌లో చూడండి
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర పరిణామాలకు దారి తీసింది. ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) కార్యదర్శి ఎ. శంకర్, కోశాధికారి ఇ. జైరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు. నిన్న‌ కేఎస్‌సీఏ అధ్యక్షుడికి తమ రాజీనామా లేఖలను సమర్పించినట్లు వారు శనివారం ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

"గత రెండు రోజులుగా చోటుచేసుకున్న దురదృష్టకర, ఊహించని పరిణామాల నేపథ్యంలో ఈ ఘటనలో మా పాత్ర పరిమితమైనప్పటికీ, నైతిక బాధ్యత వహిస్తూ కేఎస్‌సీఏ కార్యదర్శి, కోశాధికారి పదవుల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాం. 2025 జూన్ 6వ తేదీతో కూడిన మా రాజీనామా లేఖలను కేఎస్‌సీఏ అధ్యక్షుడికి సమర్పించాం" అని ఆ ప్రకటనలో శంకర్, జైరామ్ పేర్కొన్నారు.

ఇక‌, ఐపీఎల్‌లో చారిత్రక విజయం నేపథ్యంలో జూన్ 4న ఆర్సీబీ ఆటగాళ్లకు చిన్నస్వామి స్టేడియంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పాసులు ఉన్నవారికే ప్రవేశం కల్పించినప్పటికీ, తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వేలాది మంది అభిమానులు స్టేడియం వెలుపల గుమిగూడారు. ఊహించని విధంగా భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో వారిని అదుపు చేయడం కష్టతరమైంది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 50 మంది గాయపడ్డారు.

ఈ విషాద ఘటన అనంతరం మృతుల కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం నష్టపరిహారం ప్రకటించింది. అలాగే, గాయపడిన వారికి సహాయం అందించేందుకు ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది. తాజాగా కేఎస్‌సీఏ ఉన్నతాధికారుల రాజీనామాతో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం బెంగళూరు నగరంపైనా, క్రికెట్ వర్గాలపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఆర్సీబీ చారిత్రక విజయం ఆనందం ఆవిరై, విషాద ఛాయలు అలుముకున్నాయి.
Go Back to Shorts
KSCA
Karnataka State Cricket Association
Bengaluru stampede
Chinnaswamy Stadium
RCB
IPL
A Shankar
E Jairam
Royal Challengers Bangalore
KSCA officials resign

More Telugu News