Polavaram Project: పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు

Polavaram Project AP Government Takes Key Steps Forward
షార్ట్స్‌లో చూడండి
పోలవరం-బనకచర్ల నీటి తరలింపు ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచనుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. సుమారు రూ. 81 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు వివరాలను, దాని ద్వారా రైతులు మరియు ప్రజలకు చేకూరే ప్రయోజనాలను రాష్ట్ర అధికారులు వివరించనున్నారు.

గత నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను ప్రధానమంత్రికి, కేంద్ర ఆర్థిక మంత్రికి స్వయంగా వివరించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు సహా ఇతర ఉన్నతాధికారులు నేడు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ కి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

ఈ ప్రజెంటేషన్‌లో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను అధికారులు కేంద్రానికి అందించనున్నారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణకు సంబంధించిన అంశాలు, ప్రజలకు కలిగే లాభనష్టాలపై స్పష్టమైన చిత్రాన్ని ఇవ్వనున్నారు. అంతేకాకుండా, భవిష్యత్తులో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ఆర్థికంగా స్వీయ సమృద్ధి సాధించేలా ఉంటుందని, ఒక స్వయం సమృద్ధ ఆర్థిక ప్రాజెక్టుగా నిలుస్తుందని కూడా వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి వ్యక్తమయ్యే అవకాశం ఉన్న అభ్యంతరాలకు కూడా ఈ ప్రజెంటేషన్‌లో సమాధానాలు ఇచ్చేలా ఏపీ అధికారులు సన్నద్ధమైనట్లు సమాచారం. ఈ సమావేశం ద్వారా ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 
Go Back to Shorts
Polavaram Project
Andhra Pradesh
AP Government
Nara Chandrababu Naidu
Central Government
Water Resources
Irrigation Project
Polavaram-Banakaherla Project
Ajay Seth
Piyush Kumar

More Telugu News