జార్జియాలో ‘అఖండ 2’.. నెట్టింట‌ షూటింగ్ స్పాట్ వీడియో వైర‌ల్‌

  • బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ‘అఖండ 2’
  • ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా మూవీ షూటింగ్‌
  • ఇప్పటికే మహాకుంభమేళాలో కీలక సన్నివేశాల చిత్రీక‌ర‌ణ‌
  • తాజాగా కీలక షెడ్యూల్ కోసం జార్జియాకు చిత్ర‌బృందం
  • బ‌య‌ట‌కు వ‌చ్చిన అక్క‌డి షూటింగ్ స్పాట్ తాలూకు వీడియో
టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్ర‌ముఖ‌ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2’. ‘అఖండ’కు సీక్వెల్ ‘అఖండ 2-తాండవం’ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 

తాజాగా ఈ సినిమా కీలక షెడ్యూల్ కోసం చిత్రం యూనిట్‌ జార్జియా వెళ్లింది. అక్క‌డ సుందరమైన ప్రదేశాలలో సినిమా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఇందులో భాగంగా బాలయ్యపై భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకర‌ణ‌కు మేక‌ర్స్ ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో విదేశీ ఫైటర్స్ కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది.  

అయితే, జార్జియాలో ‘అఖండ 2’ షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌స్తుతం నెట్టింట‌ వైర‌ల్ అవుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మన్ బాణీలు అందిస్తున్నారు. 

బాల‌య్య స‌ర‌స‌న‌ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... న‌టుడు ఆది పినిశెట్టి ప్ర‌తినాయ‌కుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాగా, బాల‌య్య‌, బోయ‌పాటి కాంబోలో 'సింహా','లెజెండ్‌', 'అఖండ' వంటి హ్యాట్రిక్ హిట్స్ ఉండ‌డంతో ‘అఖండ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. 


More Telugu News