టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, గ్రామస్థాయి నాయకులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

  • మ‌హానాడు అద్భుతంగా జ‌రిగింద‌న్న ముఖ్య‌మంత్రి
  • స‌క్సెస్ చేసిన‌ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు అభినంద‌నలు తెలిపిన చంద్రబాబు 
  • మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారని సీఎం కితాబు
  • జూన్‌లోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలు ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డి
క‌డ‌ప‌లో జ‌రిగిన మహానాడు అనంత‌రం ఈరోజు సీఎం చంద్ర‌బాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ... మ‌హానాడు అద్భుతంగా జ‌రిగింద‌ని, విజ‌యవంతం కావ‌డంలో సహ క‌రించిన నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు అభినంద‌నలు తెలియ‌జేశారు.  

నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడుతో మ‌రోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారని చంద్ర‌బాబు ప్ర‌శంసించారు. మ‌హానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. మహానాడులో ప్రవేశపెట్టిన ‘నా తెలుగు కుంటుంబం’లోని ఆరు శాసనాల కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 

కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామంటూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉంద‌న్నారు. ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో...రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించామ‌న్నారు. 

ఇక‌, ప్రజలతో నాయకులు మరింత మమేకమవ్వడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని తెలిపారు. తాను ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం కూడా అదేన‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఎమ్మెల్యేలు కూడా విధిగా పేదల సేవలో పాల్గొనాలన్నారు. 

జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలు ప్రారంభిస్తామ‌ని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నామ‌న్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా సంక్షేమ కేలండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు.




More Telugu News