ఇంకొక్క మ్యాచ్.. క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుందాం: రజత్ పటిదార్

  • ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరిన ఆర్‌సీబీ
  • క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన బెంగ‌ళూరు
  • జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌పై కెప్టెన్ ర‌జ‌త్ ప‌టిదార్ హ‌ర్షం
  • టైటిల్‌కు అడుగుదూరంలో ఉన్నామ‌న్న ఆర్సీబీ సార‌థి
  • ఇంకో మ్యాచ్ గెలిచి.. అంద‌రం సెల‌బ్రేట్ చేసుకుందామంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపిన వైనం
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫైనల్‌కు చేరింది. ముల్లాన్పుర్ వేదికగా జరిగిన క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌ కింగ్స్ (పీబీకేఎస్‌)ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 102 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (56 నాటౌట్‌) హాఫ్ సెంచరీతో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఈ విజ‌యంతో 2016 త‌ర్వాత మ‌రోసారి బెంగ‌ళూరు ఐపీఎల్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. 

ఈ నేప‌థ్యంలో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ మ్యాచ్ అనంత‌రం మాట్లాడుతూ... "చిన్న‌స్వామి మాత్ర‌మే కాదు.. ఎక్క‌డికి వెళ్లినా హోంగ్రౌండ్‌లా ఫీల‌య్యేలా అభిమానుల మ‌ద్ద‌తు ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి వారు చూపిస్తున్న అభిమానం అద్భుతం. వీ ఆల్ ల‌వ్యూ. ఇంకొక్క మ్యాచ్‌. అంద‌రం క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుందాం" అని అభిమానుల్లో బెంగ‌ళూరు కెప్టెన్ జోష్ నింపారు. 

ఇక, ఈ మ్యాచ్‌లో త‌మ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న చేయడం ప‌ట్ల కూడా ర‌జ‌త్‌ ప‌టిదార్ హ‌ర్షం వ్యక్తం చేశాడు. బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశార‌ని, త‌మ ప్ర‌ణాళిక‌లో అనుకున్న‌ట్లు పంజాబ్‌ను క‌ట్ట‌డి చేశామ‌న్నారు. స్పిన్న‌ర్ సుయాశ్‌ శర్మ ఈ మ్యాచ్‌లో అత్య‌ద్భుతంగా బౌలింగ్ చేశాడ‌ని కొనియాడాడు. అలాగే ఓపెన‌ర్ ఫీల్ సాల్ట్ బ్యాటింగ్ తీరు త‌న‌ను ఆక‌ట్టుకుంద‌ని తెలిపాడు. 

అత‌ను ఇన్నింగ్స్‌ను ప్రారంభించే విధానం చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌న్నాడు. డ‌గౌట్ నుంచి అత‌ని బ్యాటింగ్‌ను చూస్తూ ఆస్వాదిస్తాన‌ని చెప్పాడు. మ‌రో ఓపెన‌ర్ విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదని, టోర్నీ ఆసాంతం జ‌ట్టుకు కావాల్సిన ప‌రుగులను అందిస్తున్నాడ‌ని మెచ్చుకున్నాడు. ఈసారి త‌ప్ప‌కుండా బెంగ‌ళూరు ఛాంపియ‌న్‌గా నిలుస్తుంద‌ని ర‌జ‌త్ చెప్పుకొచ్చాడు.   




More Telugu News