రాజస్థాన్‌లో మాజీ మంత్రి పీఏ అరెస్ట్.. పాక్‌తో గూఢచర్యం ఆరోపణలు!

  • రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి సకూర్ ఖాన్ అరెస్ట్
  • పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలు
  • గతంలో ఒక మంత్రి వద్ద పీఏగా పనిచేసిన వ్యక్తి
  • ఫోన్‌లో పాక్ నంబర్లు, ఏడుసార్లు పాకిస్థాన్ వెళ్లినట్లు గుర్తింపు
  • ఐఎస్ఐ నెట్‌వర్క్‌పై దర్యాప్తు సంస్థల ముమ్మర వేట
రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో అరెస్టవడం సంచలనం రేపుతోంది. గతంలో ఆయన ఒక మంత్రి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా (పీఏ) పనిచేయడం గమనార్హం.

రాజస్థాన్‌ రాష్ట్ర ఉపాధి కార్యాలయంలో పనిచేస్తున్న సకూర్ ఖాన్ మగళియార్‌ను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి ఆయన కీలక సమాచారం చేరవేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. సకూర్ ఖాన్.. పాక్ సరిహద్దుల్లోని జైసల్మేర్ జిల్లా బరోడా గ్రామానికి చెందిన మంగళియార్ ధానికి చెందిన వ్యక్తి.

గత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రికి వ్యక్తిగత సహాయకుడిగా సకూర్ ఖాన్ పనిచేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, సదరు మాజీ మంత్రి కూడా బరోడా గ్రామానికే చెందినవారు కావడం గమనార్హం.

గత కొన్ని వారాలుగా సకూర్ ఖాన్ కార్యకలాపాలపై దర్యాప్తు బృందాలు నిఘా ఉంచాయి. పాకిస్థాన్ దౌత్య కార్యాలయంతో అతనికి సంబంధాలున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. "సకూర్ అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఉన్నత స్థాయి నుంచి మాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని నిర్ధారించుకుని, ప్రశ్నించేందుకే అతడిని అరెస్ట్ చేశాం" అని ఎస్పీ సుధీర్ చౌధ్రీ మీడియాకు తెలిపారు.

అధికారులు సకూర్ ఖాన్ మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేయగా, అందులో పలు పాకిస్థానీ ఫోన్ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నంబర్ల గురించి ఖాన్ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడం లేదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. తాను ఇప్పటివరకు ఏడుసార్లు పాకిస్థాన్ వెళ్లివచ్చినట్లు ఖాన్ విచారణలో అంగీకరించాడు. ప్రస్తుతం అతని ఫోన్‌లో ఎలాంటి సైనిక రహస్య సమాచారం లభించనప్పటికీ, కొన్ని ఫైళ్లను డిలీట్ చేసినట్లు అధికారులు కనుగొన్నారు. ఖాన్‌కు సంబంధించిన రెండు బ్యాంకు ఖాతాలపై కూడా అధికారులు దృష్టి సారించారు.


More Telugu News