ముషారఫ్ కష్టాలు కంటిన్యూ..
పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ కష్టాలు ఇప్పట్లో తీరేట్టు కనిపించడంలేదు. కేసులు ఒకటి వెంట మరోటి చుట్టుముడుతున్నాయి. బెయిల్ మాత్రం దొరకడంలేదు. దీంతో, ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2006లో బలూచ్ నేషనలిస్ట్ పార్టీ నేత అక్బర్ బుగ్టిని ఓ మిలిటరీ ఆపరేషన్లో చంపేశారంటూ ముషారఫ్ పై నమోదైన కేసులో బెయిల్ నిరాకరించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన యాంటీ టెర్రరిజమ్ కోర్టు ముషారఫ్ బెయిల్ పిటిషన్ ను నేడు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్వెట్టాలోని ఈ న్యాయస్థానంలో నిన్న వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని పెండింగ్ లో ఉంచారు. ముషారఫ్ ఇప్పటికే న్యాయమూర్తుల తొలగింపు, బేనజీర్ భుట్టో హత్య కేసులతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఉన్నారు.