టీమిండియాలోకి అరంగేట్రం చేయ‌కుండానే.. క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన స్టార్ క్రికెట‌ర్‌

  • విధ్వంస‌క ఆటగాడిగా పేరొందిన‌ గుజ‌రాత్ మాజీ కెప్టెన్ ప్రియాంక్ పాంచ‌ల్
  • 127 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 97 లిస్ట్-ఎ గేమ్‌లు, 59 టీ20లు ఆడిన అనుభవజ్ఞుడు
  • దేశ‌వాళీ క్రికెట్‌లో అత్యంత స్థిరమైన బ్యాటర్‌లలో ఒకడు
  • అయినా మూడు ఫార్మాట్లలో భారత జట్టు తరపున అరంగేట్రం చేయలేకపోయిన ప్రియాంక్ 
  • సోమ‌వారం అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
భార‌త క్రికెట్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవ‌డం అంత ఈజీ కాదు. రోజురోజుకు అనేక మంది ట్యాలెంటెడ్ ప్లేయ‌ర్లు వెలుగులోకి వ‌స్తుండ‌టంతో టీమిండియాలో చోటు అనేది చాలా ట‌ఫ్‌గా మారిపోయింది. దేశ‌వాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించినా జాతీయ జ‌ట్టులో ప్లేస్ దొర‌క‌డం కొన్నిసార్లు జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు. ఇదిగో ఇక్క‌డ చెప్పుకొబోయే స్టార్ క్రికెట‌ర్ ఇదే కోవ‌కు చెందిన‌వాడు. 

అతడే ప్రియాంక్ పాంచల్. విధ్వంస‌క ఆటగాడిగా పేరొందిన‌ గుజ‌రాత్ మాజీ కెప్టెన్. 127 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 97 లిస్ట్-ఎ గేమ్‌లు, 59 టీ20లు ఆడిన అనుభవజ్ఞుడు. దేశ‌వాళీ క్రికెట్‌లో అత్యంత స్థిరమైన బ్యాటర్‌లలో ఒకరైనప్పటికీ, ప్రియాంక్ మూడు ఫార్మాట్లలో భారత జట్టు తరపున అరంగేట్రం చేయలేకపోయాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నాన‌ని వెల్ల‌డించాడు. ఈ విష‌యాన్ని గుజ‌రాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) సోమ‌వారం అధికారికంగా తెలిపింది. 35 ఏళ్ల ప్రియాంక్ గుజ‌రాత్ క్రికెట్‌కు విశేష సేవ‌లు అందించాడు. 

ఓపెనింగ్ బ్యాటర్ అయిన ప్రియాంక్ 2021-22లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియాకు ఎంపిక‌య్యాడు. స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన‌ సిరీస్‌కు ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌కు ప్ర‌త్యామ్నాయంగా అత‌డిని జ‌ట్టులోకి తీసుకున్నారు సెలెక్ట‌ర్లు. బెంగాల్ ఆట‌గాడు అభిమన్యు ఈశ్వ‌ర‌న్‌తో క‌లిసి రిజ‌ర్వ్ ఓపెన‌ర్‌గా ప్రియాంక్‌ను ఎంపిక‌య్యాడు. అయితే, తుది జ‌ట్టులో మాత్రం చోటు దక్క‌లేదు. దీంతో టీమిండియాలో అరంగేట్రం చేయ‌లేక‌పోయాడు. 

టీమిండియాకు ఆడకపోవడం క‌చ్చితంగా విచారకరం: ప్రియాంక్‌
హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిటైర్మెంట్‌ అంశం కొంతకాలంగా తన మనసులో ఉందని ప్రియాంక్ తెలిపాడు. "చాలా కాలంగా నేను రిటైర్ అవ్వాలని నా మనసులో ఉంది. నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు టీమిండియా తరపున క‌చ్చితంగా ఆడాలని గ‌ట్టిగా కోరుకున్నాను. దానికి త‌గ్గ‌ట్టుగా క్రమశిక్షణ, అంకితభావంతో ఆడాను. కానీ ఒక పాయింట్ తర్వాత నాకు అది అసాధ్యంగా అనిపించింది. నేను నా శాయశక్తులా ప్రయత్నించాను. నేను ఇండియా-ఏ తరపున ఆడాను. రంజీ ట్రోఫీలో ఆడాను. అక్క‌డ భారీగా ప‌రుగులు సాధించాను. కానీ, భార‌త జ‌ట్టులో మాత్రం చోటు ద‌క్క‌క‌పోవ‌డం ఎప్ప‌టికీ బాధిస్తుంది. టీమిండియాలో ఆడలేకపోవడం క‌చ్చితంగా విచారకరం. ఇప్పుడు సమయం ఆసన్నమైందని నేను గ్రహించాను. అందుకే రిటైర్ అవుతున్నాను" అని ప్రియాంక్ పేర్కొన్నాడు.

దేశ‌వాళీలో ప్రియాంక్ పాంచ‌ల్ గ‌ణాంకాలు ఇలా..
127 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 45.18 సగటుతో 8,856 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్య‌క్తిగ‌త స్కోరు 314 (నాటౌట్). 97 లిస్ట్-ఎ మ్యాచుల్లో 8 సెంచ‌రీల‌తో 3,672 ప‌రుగులు చేశాడు. 59 టీ20లు ఆడిన ప్రియాంక్ 28.71 స‌గ‌టుతో 1,522 ప‌రుగులు సాధించాడు.


More Telugu News