ఖైరతాబాద్ గణేశ్: 71వ ఏడాది ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ!

  • ఖైరతాబాద్ మహాగణపతి 2025 పనులకు జూన్ 6న శ్రీకారం
  • నిర్జల ఏకాదశి నాడు కర్రపూజతో విగ్రహ తయారీ ప్రారంభం
  • గతేడాది 70 అడుగుల మట్టి విగ్రహంతో దర్శనమిచ్చిన గణపయ్య
  • ఈసారి విగ్రహం ఎత్తుపై నగరవాసుల్లో ఆసక్తి
హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రులంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ఏటా ఇక్కడ కొలువుదీరే భారీ గణనాథుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాదికి సంబంధించిన ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ ఏర్పాటు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేశ్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది 71వ మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా జూన్ 6న నిర్జల ఏకాదశి పర్వదినాన విగ్రహ తయారీకి తొలి అడుగుగా కర్రపూజ నిర్వహించనున్నారు. ఈ పూజతో విగ్రహ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమవుతాయి. సాధారణంగా ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీకి సుమారు మూడు నెలల సమయం పడుతుంది.

ఖైరతాబాద్‌లో మొదటిసారిగా 1954లో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా విభిన్న రూపాల్లో, భారీ ఆకృతుల్లో గణపయ్య ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఉత్సవాల 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గతేడాది ప్రత్యేకంగా 70 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఈసారి గణపతి ఎన్ని అడుగుల ఎత్తులో కొలువుదీరతాడనే ఆసక్తి నగర ప్రజల్లో నెలకొంది.


More Telugu News