కెన‌డాలో భార‌త సంత‌తి వ్యాపార‌వేత్త దారుణ హ‌త్య

  
ఇటీవ‌ల కాలంలో కెన‌డాలో భార‌తీయుల‌పై వ‌రుస దాడులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఇదే కోవ‌లో తాజాగా మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. భార‌త సంత‌తికి చెందిన ఓ వ్యాపార‌వేత్తను కొంద‌రు దుండ‌గులు దారుణ హ‌త్య చేశారు. భార‌త సంత‌తి వ్యాపార‌వేత్త హ‌ర్జీత్‌ను ల‌డ్డా చాలా కాలంగా కెన‌డాలో ఉంటున్నాడు. 

అయితే, ఇటీవ‌ల‌ ఒంటారియో, మిసిసాగా పార్కింగ్ లాట్‌లో ఆయ‌న‌పై కొంద‌రు దుండ‌గులు విచ‌క్ష‌ణ‌రాహితంగా కాల్పులు జ‌రిపారు. అనంత‌రం అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. కుటుంబ స‌భ్యులు హ‌ర్జీత్‌ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం ద‌క్క‌లేదు. అప్ప‌టికే అతడు చ‌నిపోయిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం చోటుచేసుకోగా... ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.  

ఈ మేర‌కు హ‌ర్జీత్ మృతిపై కూతురు గుర్లీన్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. త‌న తండ్రికి ప‌లుమార్లు బెదిరింపులు వ‌చ్చాయ‌ని, పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన స్పందించ‌లేద‌ని ఆమె పేర్కొన్నారు. త‌మ‌ను కాపాడాల్సిన పోలీస్ వ్య‌వ‌స్థ పూర్తి విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. కాగా, హ‌ర్జీత్ హ‌త్య‌కు త‌మ‌దే బాధ్య‌త అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న కెన‌డా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.    




More Telugu News