లేదు.. అలాంటిదేమీ లేదు.. రాజ్ నిడిమోరుతో సమంత బంధంపై మేనేజర్

  • 'శుభం' సినిమా విజయం తర్వాత రాజ్‌తో సమంత దిగిన ఫొటోలు వైరల్
  •  వీరిద్దరూ కలిసి జీవించనున్నారని కొన్ని ఆంగ్ల మీడియా కథనాలు
  •  రాజ్ తన భార్యకు విడాకులిచ్చారని కూడా ఆ కథనాల్లో ప్రస్తావన
  •   అవన్నీ నిరాధారమైన కథనాలేనని స్పష్టం చేసిన సమంత మేనేజర్
ప్రముఖ నటి సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు మధ్య ఏదో జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై ఆమె మేనేజర్ స్పందించారు. అవన్నీ నిరాధారమైన పుకార్లేనని కొట్టిపారేశారు. సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' సినిమా విజయం నేపథ్యంలో ఆ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన రాజ్‌ నిడిమోరుతో కలిసి సమంత దిగిన కొన్ని ఫొటో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఫొటోల ఆధారంగా వీరిద్దరిపై మరోసారి రూమర్లు ఊపందుకున్నాయి.

సమంత తన నిర్మాణంలో తొలి ప్రయత్నంగా తెరకెక్కిన 'శుభం' సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా విజయోత్సవంలో భాగంగా దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో కలిసి దిగిన ఒక ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటో ఇంటర్నెట్‌లో విస్తృతంగా షేర్ కావడంతో సమంత, రాజ్‌ నిడిమోరు త్వరలో కలిసి జీవించబోతున్నారంటూ కొన్ని ఆంగ్ల వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అంతేకాదు, రాజ్‌ ఇప్పటికే తన భార్యకు విడాకులు ఇచ్చారని కూడా పేర్కొన్నాయి.

ఈ పుకార్లు తీవ్రం కావడంతో సమంత మేనేజర్ స్పందించారు. ‘‘సమంత, రాజ్‌ల గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే’’ అని ఆయన స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య కేవలం వృత్తిపరమైన స్నేహం మాత్రమే ఉందని చెప్పారు.

'శుభం' సినిమా విజయం పట్ల సమంత ఆనందం వ్యక్తం చేశారు. ‘‘మా మొదటి అడుగును ప్రేమతో స్వాగతించినందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అంటూ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమంత గతంలో రాజ్‌ నిడిమోరు, డీకే దర్శకత్వంలో వచ్చిన 'ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2' వెబ్ సిరీస్‌లో నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లోనే 'సిటడెల్‌: హనీ బన్నీ' అనే మరో వెబ్ సిరీస్ కూడా రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య స్నేహబంధం బలపడిందని, అయితే దానిని అపార్థం చేసుకుని ఇలాంటి రూమర్లు సృష్టిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News