టర్కీకి జామియా మిలియా ఇస్లామియా షాక్.. ఆ సంస్థలతో ఒప్పందాల నిలిపివేత

  • టర్కీ విద్యా సంస్థలతో ఒప్పందాలు నిలిపివేసిన జామియా మిలియా ఇస్లామియా
  • జేఎన్‌యూ బాటలోనే టర్కీపై చర్యలు తీసుకున్న విశ్వవిద్యాలయం
  • 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాక్‌కు టర్కీ మద్దతే అందుకు కారణం
  • దేశవ్యాప్తంగా 'బాయ్‌కాట్ టర్కీ' ప్రచారం... టర్కీ నుంచి దిగుమతుల నిలిపివేత
పాకిస్థాన్‌కు టర్కీ బాహాటంగా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో భారత్‌‍లో వ్యతిరేకత కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీలోని వివిధ విద్యా సంస్థలతో గతంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను (ఎంఓయూ) నిలిపివేస్తున్నట్లు జేఎంఐ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ సైమా సయీద్ జాతీయ మీడియాకు తెలియజేశారు.

కొంతకాలం క్రితం, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో టర్కీ పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు పలికింది. ఈ చర్యపై భారతదేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఢిల్లీలోని జేఎన్‌యూ టర్కీలోని ఇనొను యూనివర్సిటీతో కుదిరిన విద్యా ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పుడు జేఎన్‌యూ బాటలోనే జామియా మిలియా ఇస్లామియా కూడా పయనించింది.

'ఆపరేషన్ సిందూర్' సమయంలో టర్కీ తన సైనిక విమానాలను, ఒక యుద్ధనౌకను పాకిస్థాన్‌కు పంపించిందని పెద్ద మొత్తంలో డ్రోన్లను కూడా సరఫరా చేసిందని వార్తలు వెలువడ్డాయి. ఈ ఆయుధాలను పాకిస్థాన్ భారత్‌పై ప్రయోగించినట్లు ఆధారాలు లభించాయి. భూకంపం సంభవించినప్పుడు మానవతా దృక్పథంతో భారత్ అందించిన సహాయాన్ని టర్కీ విస్మరించి పాకిస్థాన్‌కు మద్దతు పలకడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది.


More Telugu News