Madhuri Dixit: మాధురి దీక్షిత్ చిన్న కుమారుడ్ని చూశారా..!

Madhuri Dixit Celebrates Son Rayaans 21st Birthday
  • 21వ వసంతంలోకి అడుగుపెట్టిన మాధురీ దీక్షిత్ చిన్న కుమారుడు రియాన్
  • సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మాధురీ, శ్రీరామ్ నేనే
  • చిన్ననాటి జ్ఞాపకాలతో ప్రత్యేక వీడియో షేర్ చేసిన స్టార్ కపుల్
  • కార్ రేసింగ్, వెయిట్ లిఫ్టింగ్, పియానో వాయిస్తూ ఆకట్టుకున్న రియాన్
  • త్వరలో 'మా బెహెన్' సినిమాతో అలరించనున్న మాధురీ దీక్షిత్
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ, 'ధక్ ధక్' గర్ల్ మాధురీ దీక్షిత్ ఇంట సంబరాలు నెలకొన్నాయి. ఆమె చిన్న కుమారుడు రియాన్ ఆదివారం 21వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా మాధురీ దీక్షిత్, ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ నేనే తమ కుమారుడికి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రియాన్ చిన్ననాటి నుంచి ఇప్పటివరకూ ఉన్న అపురూపమైన జ్ఞాపకాలతో కూడిన ఒక వీడియోను వారు అభిమానులతో పంచుకున్నారు.

ఈ వీడియోలో రియాన్ కేవలం చిన్నప్పటి అల్లరి మాత్రమే కాకుండా.. అతడిలోని ప్రత్యేక ప్రతిభను కూడా తల్లిదండ్రులు చూపించారు. కార్ రేసింగ్, వెయిట్ లిఫ్టింగ్, పియానో వాయించడం వంటి అంశాల్లో రియాన్ నైపుణ్యాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తమ కుమారుడి ఎదుగుదల పట్ల గర్వంగా ఉందని మాధురీ పేర్కొన్నారు. "హ్యాపీ 21st బర్త్‌డే రియాన్.. నువ్వు అద్భుతమైన యువకుడిగా ఎదగడం చూడటం మా జీవితంలో దొరికిన గొప్ప వరం. నీ భవిష్యత్తు గురించి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం" అంటూ మాధురీ ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చారు.

మాధురీ దీక్షిత్ 1999 అక్టోబర్ 17న డాక్టర్ శ్రీరామ్ నేనేను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడిన ఈ జంటకు 2003లో మొదటి కుమారుడు అరిన్, 2005లో రియాన్ జన్మించారు. కొన్నేళ్ల పాటు గృహిణిగా ఉన్న మాధురీ, ఆ తర్వాత కుటుంబంతో సహా ముంబైకి తిరిగి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. మాధురీ త్వరలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా రాబోయే 'మా బెహెన్' అనే చిత్రంలో కనిపించనున్నారు. ఇందులో తృప్తి డిమ్రి, రవి కిషన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇద్దరు కూతుళ్లను, ఇంటిని చక్కదిద్దే రేఖ అనే గృహిణి పాత్రలో మాధురీ ఇందులో నటిస్తున్నారు. నవ్వులు పూయించే ఈ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Madhuri Dixit
Madhuri Dixit son
Rayaan Nene
Bollywood actress
Sriram Nene
Ma Behen
Netflix movie
Tripti Dimri
Ravi Kishan
actress

More Telugu News