అమరవీరుడు మురళీనాయక్‌కు లోకేశ్ నివాళి.. రూ. 50 లక్షల పరిహారం

  • మురళీ నాయక్‌కు భౌతిక కాయాన్ని సందర్శించిన లోకేశ్, మంత్రులు
  • మురళి కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి
  • 5 ఎకరాల పొలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ. 50 లక్షలు
  • మురళి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్న మంత్రి
దేశం కోసం ప్రాణాలర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీ నాయక్ భౌతిక కాయానికి మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. అనంతరం మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఓదార్చారు.

మంత్రి లోకేశ్‌తో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సవిత, ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తదితరులు మురళీ నాయక్‌కు నివాళులు అర్పించారు. కాసేపట్లో అధికార లాంఛనాలతో మురళీ నాయక్ అంతక్రియలను ప్రభుత్వం నిర్వహించనుంది.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో పోరాడుతూ.. మురళీ నాయక్ వీరమరణం పొందారని అన్నారు. మురళి చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలని కలలు కన్నారని పేర్కొన్నారు. తాను చనిపోతే జాతీయ జెండా కప్పుకునే చనిపోతానని మురళీ నాయక్ అన్నారని చెప్పారు. సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే మనం సురక్షితంగా ఉండగలుగుతున్నామని పేర్కొన్నారు. చిన్నవయసులోనే అగ్నివీర్ మురళీ నాయక్ చనిపోవడం బాధాకరమని అన్నారు.
  
 మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, 5 ఎకరాల పొలంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు 300 గజాల ఇంటి స్థలం కేటాయించనున్నట్టు తెలిపారు. వీరజవాన్ మురళీనాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. 

   


More Telugu News