అమర జవాను మురళీ నాయక్ కుటుంబానికి బాలకృష్ణ అండ

  • అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి నెల వేతనాన్ని సాయంగా ప్రకటించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
  • రేపు మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి సాయాన్ని అందించనున్న బాలకృష్ణ పర్సనల్ సెక్రటరీలు
  • స్వగ్రామం గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్న మురళీనాయక్ భౌతికకాయం
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా జమ్మూకశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్‌కు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అండగా నిలిచారు. జవాన్ కుటుంబానికి తనవంతు ఆర్థిక సహాయం ప్రకటించారు.

ఒక నెల వేతనాన్ని మురళీనాయక్ కుటుంబానికి ఇస్తున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. సోమవారం మురళీనాయక్ స్వగ్రామానికి బాలకృష్ణ పర్సనల్ సెక్రటరీలు వెళ్లి జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం బాలకృష్ణ ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు.

ఇదిలా ఉండగా, మురళీనాయక్ మృతదేహం నిన్న సాయంత్రం అతని స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకుంది. ముందుగా బెంగళూరు ఎయిర్ పోర్టులో మురళీనాయక్ భౌతికకాయానికి ఏపీ మంత్రి ఎస్. సవిత నివాళులర్పించారు. 


More Telugu News