రేపు శ్రీసత్యసాయి జిల్లాలో మంత్రి లోకేశ్‌ పర్యటన‌

  • వీర జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ పార్దివదేహానికి నివాళులు అర్పించ‌నున్న మంత్రి 
  • ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. అంత్యక్రియల్లో పాల్గొననున్న లోకేశ్‌
  • రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జ‌వాన్ అంత్యక్రియలు జరిపిస్తామ‌న్న మంత్రి
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రేపు (ఆదివారం) శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. యుద్ధభూమిలో వీరమరణం పొందిన జ‌వాన్ మురళీ నాయక్ పార్దివదేహానికి మంత్రి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొంటారు. రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జ‌వాన్ అంత్యక్రియలు జరిపిస్తామ‌ని నిన్న మంత్రి లోకేశ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

ఇక‌, వీర జవాన్ మృతిపై మంత్రి లోకేశ్ శుక్ర‌వారం ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జమ్మూకశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందడం త‌న‌ను తీవ్ర ఆవేదనకు గురిచేసింద‌న్నారు. జ‌వాన్‌ చూపిన ధైర్య, సాహసాలు రాష్ట్రానికే గర్వకారణమ‌ని పేర్కొన్నారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామ‌ని తెలిపారు. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామ‌ని మంత్రి లోకేశ్ చెప్పారు. 

మురళీ నాయక్ స్వస్థలం ఏపీలోని శ్రీ స‌త్య‌సాయి జిల్లా గోరంట్ల మండ‌ల ప‌రిధిలోని క‌ల్లి తండా. గురువారం రాత్రి స‌రిహ‌ద్దు వెంబ‌డి పాక్ కాల్పులు జ‌ర‌ప‌గా మ‌న సైన్యం కూడా దీటుగానే బదులిచ్చింది. అయితే, ఈ ఎదురుకాల్పుల్లో ముర‌ళీ నాయ‌క్ చ‌నిపోయారు. ఆయ‌న‌ పార్థివ దేహం ఈరోజు స్వ‌గ్రామానికి చేరుకోనుంది. ముర‌ళీ నాయ‌క్ మృతితో స్వ‌గ్రామం క‌ల్లి తండాలో విషాదం అలుముకుంది. 


More Telugu News