భారత్-పాక్ ఉద్రిక్తత... బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన జైశంకర్

  • బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో జైశంకర్ సంభాషణ
  • ఉగ్రవాద నిర్మూలనపైనే ప్రధానంగా ఇరువురి మధ్య చర్చలు
  • ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్న జైశంకర్
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఇవాళ యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో టెలిఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమష్టిగా ఎదుర్కోవడంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు జైశంకర్ తెలిపారు. ఈ విషయంలో ఏమాత్రం వెనుకాడరాదని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్లు ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.

"ఈ మధ్యాహ్నం యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో ఫోన్‌లో మాట్లాడాను. ఉగ్రవాద నిర్మూలనపై మేం చర్చించాం. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే అంశంపై ఆయనతో చర్చించాను" అని జైశంకర్ తన పోస్టులో పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందడంతో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ దాడికి ప్రతిగా, భారత సాయుధ దళాలు మే 7వ తేదీన పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై నిర్దిష్ట దాడులు చేపట్టాయి.

'ఆపరేషన్ సింధూర్' పేరిట చేపట్టిన ఈ చర్యల్లో భాగంగా, భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం సమన్వయంతో పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా స్థావరాలతో పాటు పీఓకేలోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఆ తర్వాత పాకిస్థాన్ సాయుధ దళాలు ఎల్ఓసీ వెంబడి డ్రోన్లు, ఇతర ఆయధాలతో దాడులకు పాల్పడ్డాయి. పాక్ చర్యలకు భారత్ దీటుగా స్పందిస్తోంది.


More Telugu News