తిరుపతి వ్యాపారికి పాకిస్థాన్ నుంచి బాంబు బెదిరింపు!

  • తిరుపతి గాజుల వ్యాపారికి బెదిరింపు కాల్
  • పాకిస్థాన్ అధికారి పేరుతో +92 కోడ్‌ నుంచి ఫోన్
  • కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావన
  • ఇంటిపై బాంబు వేస్తామని హెచ్చరిక
  • డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం
తిరుపతిలో నివసించే ఓ వ్యాపారికి పాకిస్థాన్ నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఓ ఫోన్‌కాల్ తీవ్ర కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి, ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తామంటూ ఆగంతకులు బెదిరించారు. విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది.

తిరుపతికి చెందిన పగడాల త్రిలోక్‌ కుమార్‌ స్థానికంగా గాజుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన తన ద్విచక్ర వాహనంపై తిరుమల కొండకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉండగా +92 32925 27504 అనే అంతర్జాతీయ నంబర్ నుంచి ఆయన మొబైల్‌కు ఓ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడిన వ్యక్తి తనను తాను పాకిస్థాన్‌కు చెందిన అధికారిగా పరిచయం చేసుకున్నట్లు సమాచారం.

ఆగంతకుడు త్రిలోక్ కుమార్ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ "మీరు ఏం చేస్తున్నారో మాకు అంతా తెలుసు. జాగ్రత్తగా ఉండకపోతే మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం" అని తీవ్ర స్వరంతో హెచ్చరించినట్లు బాధితుడు తెలిపారు. ఈ అనూహ్య పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురైన త్రిలోక్‌ కుమార్‌ వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు విషయం తెలియజేశారు.

ఈ ఘటనపై తిరుపతి క్రైమ్ విభాగం పోలీసులు స్పందించారు. సీఐ రామ్‌కిషోర్‌ మాట్లాడుతూ "ప్రాథమిక సమాచారం ప్రకారం పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తిస్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి" అని వివరించారు. ఈ సంఘటనతో తిరుపతి నగరవాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.


More Telugu News