ఏపీలో ఓ న్యాయవాదికి కీలక పదవి ఇచ్చారు .. వైసీపీ సానుభూతిపరుడని తెలియడంతో పీకేశారు ..

  • ఏపీ సర్కార్‌లో కీలక పరిణామం
  • పొన్నవోలు అనుచరుడు దినేశ్ కుమార్ రెడ్డికి కీలక నామినేటెడ్ పదవి
  • సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు ఆగ్రహం
  • నియామకాన్ని రద్దు చేసిన సీఎండీ  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒక న్యాయవాదికి ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. అనంతరం, ఆ న్యాయవాది వైసీపీ సానుభూతిపరుడని పేర్కొంటూ కేటాయించిన నామినేటెడ్ పదవిని రద్దు చేసింది. దీంతో ఆ న్యాయవాది కుటుంబంలో ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైపోయింది.

విషయంలోకి వెళితే.. వైసీపీ ప్రభుత్వంలో ఏఏజీగా పనిచేసిన వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడైన న్యాయవాది జి. దినేశ్ కుమార్ రెడ్డిని ఎస్‌పీడీసీఎల్ మదనపల్లె డివిజన్ ఆపరేషన్ సర్కిల్ బోర్డు లీగల్ కౌన్సిల్ (బీఎల్‌సీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నియామకంపై టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

ఎందుకంటే.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టు 4న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి పేరిట అన్నమయ్య జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో అంగళ్లు వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడం, వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. ఆ ఘటనలో చంద్రబాబు సహా వందలాది మంది టీడీపీ శ్రేణులపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలకు వ్యతిరేకంగా కోర్టులో వాదనల విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, దినేశ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.

ఇప్పుడు దినేశ్ కుమార్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టడంతో, నాడు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. దీంతో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పార్టీ పరిశీలకులు శివరాం ప్రతాప్ ఈ వ్యవహారాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లారు.

దీంతో దినేశ్ కుమార్ రెడ్డి నియామకాన్ని రద్దు చేస్తూ ఎస్‌పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పార్టీ శ్రేణులు శాంతించారు. ఇదే క్రమంలో అసలు ఈ నియామకానికి సిఫారసు చేసింది ఎవరు అనే దానిపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. ఈ పరిణామంతో దినేశ్ కుమార్ రెడ్డి కుటుంబంలో కీలక పదవి వచ్చిందన్న ఆనందం రోజు వ్యవధిలోనే ఆవిరైంది. 


More Telugu News