రియాన్ ప‌రాగ్ వ‌రుస‌గా ఆరు సిక్స‌ర్లు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే తొలి ప్లేయ‌ర్‌గా రికార్డ్!

  • నిన్న‌ ఈడెన్ గార్డెన్స్‌లో త‌ల‌ప‌డ్డ కేకేఆర్‌, ఆర్ఆర్‌
  • 45 బంతుల్లోనే 95 పరుగులు బాదిన రియాన్ ప‌రాగ్‌
  • వ‌రుస‌గా ఆరు సిక్స‌ర్లు న‌మోదు చేసిన రాజ‌స్థాన్ కెప్టెన్‌
  • త‌ద్వారా ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఈ ఘ‌న‌త సాధించిన తొలి ప్లేయ‌ర్‌గా రికార్డ్‌
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్‌) కెప్టెన్ రియాన్ పరాగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్ హిస్ట‌రీలోనే వరుసగా ఆరు సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయ‌ర్‌గా చరిత్రకెక్కాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో పరాగ్ ఈ సంచలనాత్మక ఘనతను సాధించాడు. 

మొయిన్ అలీ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన ప‌రాగ్‌, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ఓవర్ రెండో బంతికి ఆరో సిక్స్‌ కొట్టాడు. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే వ‌రుస‌గా 6 సిక్స‌ర్లు బాదిన తొలి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ప‌రాగ్‌ 45 బంతుల్లో 95 పరుగులు చేసి త్రుటిలో సెంచ‌రీ చేజార్చుకున్నాడు. అలాగే ఆర్ఆర్ కూడా కేవ‌లం ఒక్క ప‌రుగు తేడాతో ప‌రాజ‌యం పాలైంది. 

ఈ ఓట‌మితో ప్లేఆఫ్స్ రేసు నుంచి రాజ‌స్థాన్ నిష్క్ర‌మించింది. ఆర్ఆర్ ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచులాడి మూడింట మాత్ర‌మే గెలిచింది. ఈ జ‌ట్టు ఖాతాలో ఆరు పాయింట్లు ఉండ‌గా మిగ‌తా రెండు మ్యాచులు గెలిచినా నాలుగు పాయింట్లే వ‌స్తాయి. దీంతో అధికారికంగా రాజ‌స్థాన్ ప్లేఆఫ్స్ నుంచి వైదొలిగింది. మ‌రోవైపు కేకేఆర్ ఈ విజ‌యంతో 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. 

కానీ, ప్లేఆఫ్‌లకు చేరుకోవడానికి మిగిలిన మూడు మ్యాచ్‌లను త‌ప్ప‌కుండా గెలవాల్సి ఉంటుంది. ఇక‌, ఇప్ప‌టికే చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే. ఈరోజు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగే మ్యాచ్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ భ‌విత‌వ్యం కూడా తేల‌నుంది.  


More Telugu News