ఆ వివాదంపై క్లారిటీ.. ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ

  • 'రెట్రో' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌పై దుమారం
  • త‌మ‌ను అవ‌మానించేలా కామెంట్స్ చేయ‌డం దారుణ‌మ‌ని ఆదివాసీ జేఏసీ నేతల ఆగ్ర‌హం
  • వివాదం ముద‌ర‌డంతో తాజాగా ప్రెస్‌నోట్ విడుద‌ల చేసి క్లారిటీ ఇచ్చిన రౌడీబాయ్‌
ఇటీవ‌ల జ‌రిగిన రెట్రో ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రౌడీబాయ్‌ విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన వ్యాఖ్య‌లపై దుమారం రేగింది. దాయాది పాకిస్థాన్ గురించి మాట్లాడుతూ ట్రైబ‌ల్స్ లాగా కొట్టుకోవ‌డం ఏంటి అని అన్నారు. దాంతో విజ‌య్ త‌మ‌ను అవ‌మానించేలా కామెంట్స్ చేయ‌డం దారుణ‌మ‌ని ఆదివాసీ జేఏసీ నేతలు మండిప‌డ్డారు. గిరిజ‌నుల చ‌రిత్ర తెలిసిన‌ట్లు హేళ‌న చేస్తూ మాట్లాడ‌డం స‌రికాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని వారు డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో తెలంగాణ ట్రైబ‌ల్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, న్యాయ‌వాది కిష‌న్‌రాజ్ చౌహాన్, ప్ర‌తినిధులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

దీంతో త‌న వ్యాఖ్య‌ల‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎవ‌రినీ బాధ‌పెట్ట‌డం త‌న ఉద్దేశం కాద‌న్నారు. తన వ్యాఖ్య‌ల‌తో ఎవ‌రైనా బాధ‌ప‌డి ఉంటే విచారం వ్య‌క్తం చేస్తున్నానని తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న వివరణ ఇస్తూ ఒక ప్రెస్‌నోట్ విడుద‌ల చేశారు.   

 " 'రెట్రో' ఆడియో లాంచ్ ఈవెంట్‌లో నేను చేసిన కామెంట్స్ కొంద‌రి మనోభావాల‌ను దెబ్బ‌తీసిన‌ట్లు నా దృష్టికి వచ్చింది. దీనిపై నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఎవ్వరినీ ఉద్దేశపూర్వకంగా హర్ట్ చేయాలని అలా మాట్లాడలేదు. నాకు గిరిజ‌నులంటే అపార‌మైన గౌర‌వం ఉంది. వారిని అవ‌మానించాల‌న్న‌ది నా ఉద్దేశం కానే కాదు. 

నేను యూనిటీ గురించి మాట్లాడాను. భార‌త ప్ర‌జలు ఎలా ఒక‌టిగా క‌లిసి ఉండాలి, మనం ఎలా కలిసి ముందుకు సాగాలి అనే దాని గురించి  మాత్రమే కామెంట్ చేశాను. ఏ ఒక్కరినీ కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా అలాంటి కామెంట్స్ చేయలేదు. నేను ట్రైబల్స్ అనే పదం వేరే సెన్స్‌లో వాడాను. నేను ఎప్పుడూ ఎవరిపైనా ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపలేదు. వారందరూ నా కుటుంబసభ్యులు, సోదరులే అని భావిస్తాను. నా కామెంట్స్ వల్ల ఎవరైనా బాధ పడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను. శాంతి గురించి మాట్లాడడమే నా ఏకైక లక్ష్యం" అని ఆయ‌న‌ అన్నారు.

ఇక‌, తాను 'ట్రైబల్స్' అనే పదం వాడడం వెనుక ఉద్దేశాన్ని కూడా విజయ్ దేవరకొండ వివ‌రించారు. "హిస్టారికల్, డిక్షనరీ సెన్స్‌లోనే నేను ఆ పదాన్ని వాడాను. వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. ఆ సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. అసలు నాగరికత మొదలు కాక ముందు క్లాన్స్, రాజ్యాలు అంటూ ఉండేవి. అంతే తప్ప షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించడం మొదలుపెట్టిన తర్వాత ఇలా వర్గీకరణ అనేది జరిగింది. అలా జరిగి కనీసం 100 ఏళ్లు కూడా పూర్తి కాలేదు" అని రౌడీబాయ్‌ వివరణ ఇచ్చారు.


More Telugu News