అది మూత్రం కాదు అమృతం.. ప‌రేశ్‌ రావ‌ల్ బాట‌లోనే బాలీవుడ్ న‌టి అను అగ‌ర్వాల్

  • తన మోకాలికి గాయమైన‌ప్పుడు, దాని నుంచి కోలుకోవడానికి మూత్రం తాగిన‌ట్టు చెప్పిన ప‌రేశ్ రావ‌ల్‌
  • హీరో అజయ్ దేవగణ్ తండ్రి వీరూ దేవగణ్ సలహా మేర‌కు తాను ఆ ప‌నిచేసిన‌ట్లు వెల్ల‌డి
  • తాను కూడా యూరిన్ తాగిన‌ట్లు చెప్పిన న‌టి అను అగ‌ర్వాల్‌
  • అది శ‌రీర ఆరోగ్యానికి అమృతంలా ప‌నిచేస్తుంద‌న్న న‌టి
బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు పరేశ్‌ రావల్ ఒక స‌మ‌యంలో త‌న మూత్రం తాను తాగిన‌ట్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. తన మోకాలికి గాయమైన‌ప్పుడు, దాని నుంచి కోలుకోవడానికి తాను మూత్రం తాగిన‌ట్టు చెప్పారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యారు. 

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ తండ్రి, సీనియర్ స్టంట్ డైరెక్టర్ వీరూ దేవగణ్ సలహా మేర‌కు గాయం నుంచి కోలుకోవ‌డానికి త‌న‌ యూరిన్ తాను తాగినట్లు ఆయ‌న చెప్పుకొచ్చారు.

అయితే, ఇప్పుడు ప‌రేశ్‌ రావల్ బాట‌లోనే మ‌రో బాలీవుడ్ న‌టి అను అగ‌ర్వాల్ న‌డిచార‌ట‌. ఆయన వ్యాఖ్య‌ల‌కి మ‌ద్ద‌తుగా ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. తాను కూడా మూత్రం తాగినట్లు ఆమె తెలిపారు. 

అను అగ‌ర్వాల్ ఏం చెప్పారంటే..?
'ఇన్‌స్టంట్ బాలీవుడ్‌'తో జరిగిన ఇంట‌ర్వ్యూలో అను అగర్వాల్ ఇలా అన్నారు... "చాలా మందికి ఇది తెలియదు. అది అజ్ఞానమో లేదా అవగాహన లేకపోవడమో. కానీ, ఆమ్రోలి అని పిలువబడే మూత్రం తాగడం నిజానికి యోగాలో ఒక ముద్ర (సంజ్ఞ/సాధన). నేను దానిని స్వయంగా అభ్యసించాను. నేను దానిని ప్రయత్నించాను. ఇది చాలా ముఖ్యమైన అభ్యాసం. కానీ గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మొత్తం మూత్రాన్ని తాగరు. 

దానిలో కొంత‌ భాగాన్ని మాత్రమే తీసుకుంటారు. ఆ భాగాన్ని అమృత్‌ (అమృతం)గా పరిగణిస్తారు. ఇది వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మ‌న చర్మంపై ముడతలు ప‌డ‌కుండా చేస్తుంది. ఇది ఆరోగ్య శ్రేయస్సుకు నిజంగా అద్భుతంగా ప‌నిచేస్తుంది. నేను వ్యక్తిగతంగా దాని ప్రయోజనాలను పొందాను" అని ఆమె చెప్పుకొచ్చారు. 

అయితే, వైద్యులు తాగొద్దంటున్నారు క‌దా అని అడ‌గ్గా... సైన్స్ ఎప్పటిది? 200 ఏళ్లు? యోగా 1000 ఏళ్ల నుంచి ఉంది. మీరు రెండిటిలో దేనిని నమ్ముతారు? అని అను అగర్వాల్ తిరిగి ప్ర‌శ్నించారు. కాగా, 1990లో వ‌చ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ఆషికిలో అను అగ‌ర్వాల్ హీరోయిన్‌. ఈ సినిమాతో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇక‌, ప‌రేశ్ రావ‌ల్ వ్యాఖ్య‌ల‌ను వైద్య నిపుణులు త‌ప్పుబట్టిన విష‌యం తెలిసిందే. సోషల్ మీడియాలో 'ది లివర్ డాక్' అని పిలిచే డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ పరేశ్‌ రావల్‌ను తీవ్రంగా విమర్శించారు. "దయచేసి మీ మూత్రాన్ని తాగకండి. మూత్రం తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయ‌న‌డానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. బాలీవుడ్ నటుడు మాట‌లు న‌మ్మి మీరు అలా చేయొద్దు" అని ఆయన అన్నారు.


More Telugu News