ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
- తప్పు జరిగితే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి
- ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని ఇంజనీర్లకు మంత్రి సూచన
- చిన్న ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరిక
న్యాక్ లో 390 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం న్యాక్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతి పొందిన వారికి ఆర్డర్ కాపీలను అందజేశారు. గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలని ఇంజినీర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఎక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజినీర్లదేనని చెప్పారు. ‘తప్పు జరిగిందని చెబితే చాలు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. టోల్‌ఫ్రీ నెంబర్ ఇస్తాం.. ఎవరైనా సరే దానికి ఫోన్ చేసి వివరాలు చెప్పవచ్చు. నిజమైన పేదలకే ఇళ్లు కేటాయించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఇందులో మరో మాట లేదు. అర్హులను ఎంపిక చేసేటప్పుడు అన్ని విషయాలూ పరిశీలించాలి. ఇళ్ల నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదు’’ అని పొంగులేటి ఇంజనీర్లకు స్పష్టం చేశారు.