గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి నూడుల్స్ తింటుండగా కొడుకును పట్టుకున్న తల్లిదండ్రులు.. నడిరోడ్డుపై విచక్షణ రహితంగా దాడి.. వీడియో ఇదిగో!

  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘటన
  • యువకుడి ప్రేమ వ్యవహారం నచ్చకపోవడమే కారణం
  • చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు 
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ కుమారుడి ప్రేమ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా వారిని చితకబాదారు. పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూర్‌లోని గుజైనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌గోపాల్ కూడలి వద్ద శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రోహిత్ (21) అనే యువకుడు తన స్నేహితురాలు (19) తో కలిసి చౌమీన్ (నూడుల్స్) తింటున్నాడు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న రోహిత్ తల్లిదండ్రులు శివ్‌కరణ్, సుశీల.. కుమారుడి ప్రేమ వ్యవహారం నచ్చకపోవడంతో ఒక్కసారిగా వారిద్దరిపై దాడికి దిగారు.

వైరల్ అయిన వీడియోలో రోహిత్ తల్లి సుశీల యువ జంటను తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు కనిపించాయి. వారు టూవీలర్‌పై తప్పించుకునే ప్రయత్నం చేయగా సుశీల యువతి జుట్టు పట్టుకుని లాగడం వీడియోలో రికార్డయింది. అక్కడున్న స్థానికులు, బాటసారులు వారిని విడదీసేందుకు ప్రయత్నించారు. మరోవైపు, రోహిత్ తండ్రి శివ్‌కరణ్ తన కొడుకును చెప్పుతో కొట్టడం కూడా కనిపించింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇరు పక్షాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. ఈ ఘటనలో ఇరు పక్షాలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. నడిరోడ్డుపై జరిగిన ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


More Telugu News