ఆధారాలు లేకుండా నిందిస్తున్నారు.. ఫేక్ పోస్టుపై పాక్ నటి హనియా ఆమిర్ ఆవేదన

  • పహల్గామ్ దాడికి పాక్ ఆర్మీ కారణమంటూ హనియా చేసినట్టుగా పోస్ట్
  • ఆ ప్రకటన తాను చేయలేదని, తన అభిప్రాయం కాదని నటి స్పష్టీకరణ
  • తీవ్రవాదుల చర్యలు దేశానికి ఆపాదించరాదని వ్యాఖ్య
  • నిరాధార ఆరోపణలు విభేదాలు పెంచుతాయని హితవు
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాకిస్థాన్ సైన్యం ప్రమేయం ఉందంటూ తన పేరుతో వైరల్ అయిన ఓ నకిలీ ప్రకటనపై పాకిస్థాన్ ప్రముఖ నటి హనియా ఆమిర్ తీవ్రంగా స్పందించింది. ఆ ప్రకటన పూర్తిగా కల్పితమని, దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని  స్పష్టం చేసింది. భారత్‌లో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ అయిన నేపథ్యంలో ఆమె ఈ వివరణ ఇచ్చింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి పాక్ సైన్యం, ఇస్లామిక్ ఉగ్రవాదులే కారణమంటూ హనియా ఆమిర్ వ్యాఖ్యానించినట్టుగా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. భారత్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హనియా ఈ ఆరోపణలను గట్టిగా ఖండించింది. ‘ఆ ప్రకటన నేను చేయలేదు. అందులో పేర్కొన్న పదాలతో నేను ఏకీభవించను, వాటికి నేను కట్టుబడి లేను. అది పూర్తిగా కల్పితం, నా వ్యక్తిత్వాన్ని, నా విశ్వాసాలను అది తప్పుగా సూచిస్తోంది’ అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొంది.

‘ఎక్స్’ లో విస్తృతంగా షేర్ అవుతున్న పోస్టులు
ప్రస్తుతం భారత్‌లో హనియా ఆమిర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అందుబాటులో లేనప్పటికీ, ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు సంబంధించిన క్లిప్‌లు 'ఎక్స్' వేదికగా విస్తృతంగా షేర్ అవుతున్నాయి. పహల్గామ్‌లో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే ఉగ్రవాదులు జరిపిన దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత భారత్ పాకిస్థాన్‌పై పలు కఠిన చర్యలు తీసుకుంది. వీసాలు రద్దు చేయడం, దౌత్య సంబంధాలు తగ్గించడం, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి చర్యలతో పాటు హనియా ఆమిర్, మహీరాఖాన్, అలీ జాఫర్ వంటి పలువురు పాక్ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను  భారత్‌ నిలిపివేసింది.

తీవ్రవాదుల చర్య దేశాన్ని ప్రతిబింబించదు
హనియా మాట్లాడుతూ తీవ్రవాదుల చర్యలు మొత్తం దేశాన్ని లేదా ప్రజలను ప్రతిబింబించవని పేర్కొంది. ‘రుజువులు లేకుండా నిందలు వేయడం విభేదాలను మరింత పెంచుతుంది. అసలైన కరుణ, న్యాయం, స్వస్థత అవసరాన్ని పక్కదారి పట్టిస్తుంది’ అని పేర్కొంది. పహల్గామ్ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ‘ఇది చాలా సున్నితమైన, భావోద్వేగ సమయం. అమాయకులు ప్రాణాలు కోల్పోయినందుకు నా హృదయం ద్రవించిపోతోంది. ఈ నొప్పి నిజమైనది. దీనికి సానుభూతి అవసరం కానీ రాజకీయం కాదు’ అని హనియా వివరించింది.


More Telugu News