పాక్ హ్యాకర్ల పంజా: నకిలీ పీడీఎఫ్‌లతో భారతీయులే టార్గెట్!

  • భారత ఇంటర్నెట్ వినియోగదారులపై పాకిస్థాన్ నుంచి సైబర్ దాడులు ఉధృతం
  • అధికారిక పత్రాల్లా నకిలీ పీడీఎఫ్ ఫైల్స్ పంపి హ్యాకింగ్‌కు యత్నం
  • భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే దాడుల పెరుగుదలకు కారణమని నిపుణుల అంచనా
  • కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ లక్ష్యంగా మాల్‌వేర్ వ్యాప్తి
భారత ఇంటర్నెట్ వినియోగదారులే లక్ష్యంగా పాకిస్థాన్ నుంచి సైబర్ దాడులు తీవ్రమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే ఈ దాడుల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. ముఖ్యంగా, అధికారిక పత్రాల రూపంలో నకిలీ పీడీఎఫ్ ఫైళ్లను పంపి, వాటి ద్వారా హానికరమైన మాల్‌వేర్‌ను చొప్పించి భారతీయుల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసేందుకు పాక్ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు.

'పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన నివేదిక మరియు అప్‌డేట్' వంటి పేర్లతో నకిలీ పీడీఎఫ్‌లను పంపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇవి ప్రభుత్వ పత్రాల్లా కనిపించినా, వినియోగదారుల సమాచారాన్ని తస్కరించే ఫిషింగ్ డొమైన్‌లకు దారితీస్తాయి. వీటిని తెరిస్తే పరికరాలు హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది. 

ఏపీటీ36 (ట్రాన్స్‌పరెంట్ ట్రైబ్), సైడ్‌కాపీ వంటి పాకిస్థానీ హ్యాకర్ గ్రూపులు క్రిమ్సన్‌రాట్, కర్‌ల్‌బ్యాక్ రాట్ వంటి మాల్‌వేర్‌లను ఉపయోగించి రక్షణ, ప్రభుత్వ, కీలక మౌలిక సదుపాయాల రంగాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని క్విక్ హీల్ టెక్నాలజీస్, పీడబ్ల్యూసీ ఇండియా వంటి సంస్థల నిపుణులు తెలిపారు. ఈ దాడులు కేవలం సాంకేతిక అంతరాయాలే కాదని, వ్యూహాత్మక భౌగోళిక రాజకీయ ఎత్తుగడలని వారు విశ్లేషిస్తున్నారు. ఇవి భారత హ్యాకింగ్ గ్రూపుల దాడులకు ప్రతీకార చర్యలుగా కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలియని వారి నుంచి వచ్చే ఈమెయిళ్లు, అనుమానాస్పద పీడీఎఫ్ అటాచ్‌మెంట్లు, లింకుల పట్ల జాగ్రత్త వహించాలి... ఫైల్స్ తెరిచే ముందు వాటి ప్రామాణికతను ధృవీకరించుకోవాలి... ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి... అనుమానాస్పద వెబ్‌సైట్లు, ప్రకటనలపై క్లిక్ చేయవద్దు... అని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


More Telugu News