ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాలి: గిల్‌క్రిస్ట్ కీలక వ్యాఖ్యలు

  • 2025 ఐపీఎల్ సీజన్ తర్వాత ధోనీ రిటైర్ అవ్వాలని సూచన
  • ధోనీ ఇప్పటికే అన్నీ సాధించారని, నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని వ్యాఖ్య
  • జట్టు అవసరాల దృష్ట్యా వచ్చే ఏడాది ధోనీ ఆడాల్సిన అవసరం లేదన్న గిల్‌క్రిస్ట్
  • ధోనీతో పాటు రషీద్, కాన్వే, హుడాలను కూడా పక్కనపెట్టాలని గిల్లీ సూచన
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు, భారత క్రికెట్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్, దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 ఐపీఎల్ సీజన్ తర్వాత ధోనీ ఆట నుంచి తప్పుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంపై గిల్‌క్రిస్ట్ స్పందించారు. ఈ సీజన్‌లో సీఎస్కే ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో వెనుకబడింది. గాయం కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐదు మ్యాచ్‌ల తర్వాత టోర్నీకి దూరం కావడం, తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ధోనీ కూడా బ్యాటింగ్‌లో ఆశించినంతగా రాణించకపోవడం (ఈ సీజన్‌లో 98 బంతుల్లో 140 పరుగులు) వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న గిల్‌క్రిస్ట్, ధోనీ భవిష్యత్తుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

"ధోనీ ఇప్పటికే తాను సాధించాల్సిందంతా సాధించేశాడు. ఆటపరంగా అతను ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అయితే, ఏం చేయాలన్నది పూర్తిగా అతని వ్యక్తిగత నిర్ణయం. కానీ, నా అభిప్రాయం ప్రకారం, జట్టు అవసరాల దృష్ట్యా వచ్చే ఏడాది అతను ఆడాల్సిన అవసరం లేదు. ఐ లవ్ యూ ఎంఎస్. నువ్వొక ఛాంపియన్‌వి, ఐకాన్‌వి" అని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నారు. ధోనీ ఆట పట్ల, అతని ఘనతల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని చెబుతూనే, జట్టు ప్రయోజనాల దృష్ట్యా మార్పులు అవసరమని సూచించారు.

వచ్చే సీజన్‌కు ముందు చెన్నై జట్టులో ప్రక్షాళన అవసరమని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డారు. ధోనీతో పాటు యువ ఆటగాడు షేక్ రషీద్, కివీస్ ఓపెనర్ డేవాన్ కాన్వే, ఆల్ రౌండర్ దీపక్ హుడాలను కూడా జట్టు నుంచి తప్పించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించడం గమనార్హం.

ఐపీఎల్ 2025 సీజన్ ముగిసే నాటికి పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు తొలి రెండు స్థానాల్లో నిలుస్తాయని ఆడమ్ గిల్‌క్రిస్ట్ జోస్యం చెప్పారు.


More Telugu News