ఏపీసీసీ కార్యాలయంపై కోడిగుడ్లతో దాడి... షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు

  • పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం మోదీపై షర్మిల విమర్శలు
  • విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి బీజేపీ శ్రేణుల యత్నం
  • బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం
విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టడించే ప్రయత్నం చేశాయి. షర్మిల వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. 

దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయంపై కోడిగుడ్లతో దాడి చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో షర్మిల మాట్లాడుతూ... దేశ నిఘా వ్యవస్థలు ప్రధాని మోదీ కోసం పనిచేస్తున్నాయని, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News