పాక్ కు విడిచే బదులు మాకు తాగు నీళ్లివ్వండి.. పంజాబ్ కు హర్యానా సీఎం విజ్ఞప్తి

  • తాగునీటిపై ఇరు రాష్ట్రాల మధ్య ముదురుతున్న వివాదం
  • భాక్రా నంగల్ ప్రాజెక్టు నుంచి నీరివ్వాలని సైనీ డిమాండ్
  • డ్యామ్ ఖాళీ చేయకపోతే నీరు పాకిస్థాన్‌ కు వెళ్తుందని హెచ్చరిక
  • హర్యానా వాదనలను ఖండించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మధ్య నీటి పంపకాల వివాదం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. తమ రాష్ట్రానికి తాగునీటిని విడుదల చేయాలని, లేదంటే భాక్రా డ్యామ్‌లోని అదనపు జలాలు పాకిస్థాన్‌ కు పోతాయని హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ పంజాబ్‌ను హెచ్చరించారు. వర్షాకాలంలో నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా జూన్ లోపు భాక్రా జలాశయాన్ని ఖాళీ చేయాలని ఆయన నొక్కి చెప్పారు.

"జలాశయంలో నీటిని నిల్వ చేయడానికి స్థలం లేకపోతే, అదనపు నీరు హరి-కే-పట్టన్ మీదుగా పాకిస్థాన్‌ కు వెళ్తుంది. ఇది పంజాబ్‌కు గానీ, దేశానికి గానీ మంచిది కాదు" అని సైనీ అన్నారు. ఈ వివాదం కారణంగా ఢిల్లీ తాగునీటి సరఫరాపై పైనా ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది తమకు రావాల్సిన పూర్తి వాటా నీరు అందలేదన్నారు. గత నెల భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ హర్యానాకు విడుదల చేసిన నీటిలో 500 క్యూసెక్కులు ఢిల్లీకి, 800 క్యూసెక్కులు రాజస్థాన్‌కు, 400 క్యూసెక్కులు పంజాబ్‌కే వెళ్లాయని, దీంతో హర్యానాకు వాస్తవంగా 6,800 క్యూసెక్కులు మాత్రమే అందాయని సైనీ వివరించారు.

హర్యానా డిమాండ్ మేరకు నీటిని విడుదల చేయాలని బీజేపీ ప్రభుత్వం భాక్రా బియాస్ మేనేజ్ మెంట్ బోర్డు ద్వారా పంజాబ్‌పై ఒత్తిడి తెస్తోందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు. హర్యానా ఇప్పటికే మార్చి నెలలో కేటాయించిన నీటి వాటాలో 103 శాతం వినియోగించుకుందని ఆయన పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సట్లెజ్-యమునా లింక్ కెనాల్ నిర్మాణంపై వివాదం ఏళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పంజాబ్‌లో వరి సాగు ఏప్రిల్ మే నెలల్లో ఉండదని, ఈ సమయంలో విడుదల చేసే నీరు కేవలం తాగునీటి అవసరాలకేనని సైనీ చెప్పారు. అయితే, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో, చినాబ్, జీలం వంటి నదుల జలాలను ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లించాలని భగవంత్ మాన్ కేంద్రాన్ని కోరారు.


More Telugu News