వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్న అవినాశ్ రెడ్డి
  • బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్
  • తదుపరి విచారణను జులై చివరకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌కు కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

ఈ అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. కౌంటర్ దాఖలుకు సమయం ఇస్తూ, తదుపరి విచారణను జులై చివరి వారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అప్పటికి తన పదవీకాలం ముగియనున్నందున, ఈ కేసు విచారణను వేరొక ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం ఉందని జస్టిస్ ఖన్నా సూచనప్రాయంగా తెలిపారు.

విచారణ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తాజా దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సీబీఐ అధికారి రాంసింగ్‌తో పాటు వివేకా కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్తపై గతంలో నమోదైన కేసు పూర్తిగా కక్షసాధింపు చర్య అని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. ఇద్దరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ఎంపీ అవినాశ్ రెడ్డే ఈ కేసును బనాయించారని ఆరోపించింది. 

అవినాశ్ రెడ్డి బెయిల్‌పై బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడం లేదా బెదిరించడం వంటివి చేస్తారనడానికి ఈ ఘటనే నిదర్శనమని ప్రభుత్వం తరపు న్యాయవాదితో పాటు, సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. అందువల్ల అవినాశ్ రెడ్డి బెయిల్‌ను తక్షణమే రద్దు చేయాలని వారు కోర్టును అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం, విచారణను వాయిదా వేసింది. 


More Telugu News