2026 మార్చి నాటికి బందరు ఫిషింగ్ హార్బర్ పనులను పూర్తి చేస్తాం: బీసీ జనార్దన్

  • మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలించిన మంత్రులు
  • 2026 మార్చి నాటికి హార్బర్ పూర్తి లక్ష్యమని మంత్రి జనార్దన్
  • ప్రాజెక్టులో ఇప్పటికే 57 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడి
మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను 2026 మార్చి నాటికి పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ తెలిపారు. ఈ లక్ష్యంతోనే హార్బర్ నిర్మాణ కాలపరిమితిని రెండోసారి పొడిగించినట్లు ఆయన తెలిపారు. సోమవారం నాడు మచిలీపట్నంలో నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ పనుల పురోగతిని మంత్రులు బీసీ జనార్దన్, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం మంత్రి బీసీ జనార్దన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తిగా నిలిచిపోయాయని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనులను వేగవంతం చేసిందని, సుమారు రూ. 422 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 57 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. అయితే, కొన్ని కీలక పనుల్లో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రూ.3500 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సీ మౌత్ సమస్య పరిష్కారానికి సాంకేతిక నివేదిక కోసం చెన్నైకి పంపామని, అది 45 రోజుల్లో వస్తుందని, ఆ తర్వాత ఆ పనులు కూడా పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 

ఈ హార్బర్ పూర్తయితే, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని జనార్దన్ పేర్కొన్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తూ, స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ సహకారంతో ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నామని ఆయన వివరించారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని హోం మంత్రి అనిత అన్నారు. రాజధాని అమరావతి కోసం కోసం మహిళలు ఎన్నో పోరాటాలు చేశారని, గత ప్రభుత్వ హయాంలో వారిపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. జగన్ మూడు రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేశారని ఆమె విమర్శించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక ఒక శుభపరిణామమని ఆమె వ్యాఖ్యానించారు. అమరావతి పునర్నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రి అనిత కోరారు. 


More Telugu News