గడువు దాటినా ఇక్కడే ఉంటే మూడేళ్లు జైలు, 3 లక్షలు ఫైన్.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
- పహల్గామ్ దాడి తర్వాత పాక్ పౌరుల వీసాలు రద్దు
- దేశం విడిచి వెళ్లేందుకు 72 గంటల గడువు
- 3 రోజుల్లో స్వదేశానికి వెళ్లిపోయిన 537 మంది పాక్ జాతీయులు
- పాకిస్థాన్ నుంచి 850 మంది భారతీయుల రాక
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ దాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు, పాక్ పౌరులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేస్తూ భారత ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఇదివరకే జారీ చేసిన పలు కేటగిరీల వీసాలను ఏప్రిల్ 27, 2025 నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వైద్య వీసాలకు మాత్రం ఏప్రిల్ 29, 2025 వరకు గడువు ఇచ్చారు. సుమారు 12 రకాల వీసాలు కలిగిన పాక్ పౌరులు ఆదివారం లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు.
ఈ ఆదేశాల నేపథ్యంలో గత మూడు రోజులుగా పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారీగా ప్రజల తరలింపు జరిగింది. శుక్రవారం నుంచి మొత్తం 537 మంది పాకిస్థానీ జాతీయులు (వీరిలో 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నారు) భారత్‌ను విడిచి తమ స్వదేశానికి వెళ్లినట్లు అధికారులు పీటీఐకి తెలిపారు. అదే సమయంలో పాకిస్థాన్‌లో ఉన్న 850 మంది భారతీయులు (14 మంది దౌత్యవేత్తలు, అధికారులతో సహా) ఇదే మార్గం గుండా సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చినట్లు వెల్లడించారు.