భర్త సమాచారం తెలియక ఆందోళన చెందుతున్న బీఎస్ఎఫ్ జవాను భార్య

  • పొరపాటున సరిహద్దు దాటి పాక్ సైన్యం చేతికి చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం సాహూ
  • భర్త సాహూ సమాచారం కోసం ఆందోళన చెందుతున్న భార్య రజని, కుటుంబ సభ్యులు
  • తన భర్త సమాచారం కోసం నేడు పంజాబ్‌లోని ఫిరోజ్ పుర్ సెక్టార్‌కు వెళుతున్న రజని
సరిహద్దు దాటి పొరపాటున పాకిస్థాన్ సైన్యానికి చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం సాహూ గురించిన సమాచారం తెలియక ఆయన భార్య ఆందోళన చెందుతున్నారు. సాహూ పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాహూ పాకిస్థాన్ సైన్యం చేతికి చిక్కి ఐదు రోజులు దాటుతున్నా, ఆయన ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై ఎటువంటి సమాచారం లేదని ఆయన భార్య రజనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుండి తాను తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని ఆమె తెలిపారు.

ప్రస్తుతం గర్భిణిగా ఉన్న రజనీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త రాకకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి సోమవారం ఆయన పనిచేసే పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ సెక్టార్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. చండీగఢ్‌కు విమాన టికెట్ తీసుకున్నానని, అక్కడి నుండి ఫిరోజ్‌పుర్ వెళుతున్నామని, తనతో పాటు కుమారుడు, ముగ్గురు బంధువులు వస్తారని రజనీ వెల్లడించారు.

ముందుగా ఆదివారం సాయంత్రమే బయలుదేరడానికి అమృత్‌సర్ మెయిల్‌కు టికెట్ బుక్ చేసుకున్నానని, అయితే టికెట్ కన్ఫర్మ్ కాకపోవడంతో విమానంలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. ఫిరోజ్‌పూర్‌లోని అధికారులు తన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రభుత్వ అధికారులను కలుస్తానని రజనీ పేర్కొన్నారు.

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో పూర్ణం సాహూ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పూర్ణం సాహూను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం చర్చలు జరుపుతోంది. 


More Telugu News