Babar Azam: స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ పై వేటు... శ్రీలంకతో కీలక మ్యాచ్ లో టాస్ ఓడిన పాకిస్థాన్

Babar Azam Dropped Pakistan Faces Sri Lanka in Key Match
  • కాండీ వేదికగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • సెమీస్ చేరాలంటే పాకిస్థాన్ 64 పరుగుల తేడాతో గెలవాలి
  • ఫామ్ లేమి కారణంగా పాక్ జట్టు నుంచి బాబర్ ఆజం తొలగింపు
  • శ్రీలంక జట్టులో గాయపడ్డ కుశాల్ మెండిస్ స్థానంలో కమిల్ మిషారా
  • రెండు వరుస ఓటములతో ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన లంక
టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భాగంగా శనివారం శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. కాండీలోని పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక బౌలింగ్ ఎంచుకున్నాడు. సెమీస్ రేసులో నిలవాలంటే పాకిస్థాన్ జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కాగా, శ్రీలంక మాత్రం ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ను జట్టు నుంచి తప్పించారు. బాబర్‌తో పాటు సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జాలకు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. వీరి స్థానంలో నసీమ్ షా, ఖ్వాజా నఫే, అబ్రార్ అహ్మద్‌లను తీసుకున్నారు. న్యూజిలాండ్ నెట్ రన్ రేట్‌ను అధిగమించి పాకిస్థాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే, ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై కనీసం 64 పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంది.

టాస్ గెలిచిన అనంతరం శ్రీలంక కెప్టెన్ షనక మాట్లాడుతూ.. "మేము మొదట బౌలింగ్ చేస్తాం. పిచ్ బాగుంది, తర్వాత మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో మేము బేసిక్స్ సరిగ్గా పాటించలేకపోయాము. అభిమానులు ఎప్పుడూ మా వెంటే ఉన్నారు, వారి కోసం ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలనుకుంటున్నాం" అని తెలిపాడు. శ్రీలంక జట్టులో గాయపడిన కుశాల్ మెండిస్ స్థానంలో కమిల్ మిషారా జట్టులోకి వచ్చాడు.

మరోవైపు పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. "మాకు ఇదొక గొప్ప అవకాశం. మేము బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో రాణించాలి. భారీ స్కోరు సాధించి వారిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాం" అని పేర్కొన్నాడు.

తుది జట్లు:

పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), ఖ్వాజా నఫే, ఉస్మాన్ ఖాన్ (కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షహీన్ ఆఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.

శ్రీలంక: పతుమ్ నిస్సాంక, కమిల్ మిషారా (కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక (కెప్టెన్), జనిత్ లియానగే, దునిత్ వెల్లాలగే, మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక.
Babar Azam
Pakistan vs Sri Lanka
T20 World Cup 2026
Sri Lanka
Pakistan Cricket
Dasun Shanaka
Salman Agha
Pallekele Stadium
Cricket Match
T20 Cricket

More Telugu News