పహల్గామ్ దాడిని ఖండించిన కాష్ పటేల్.. భారత్‌కు పూర్తి మద్దతు

  • పహల్గామ్ దాడిపై కాష్ పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి
  • ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటన
  • అధ్యక్షుడు ట్రంప్, తులసి గబార్డ్ నుంచి సంఘీభావం
  • తీవ్రవాద ముప్పుపై ప్రపంచం అప్రమత్తంగా ఉండాలని సూచన
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని అమెరికాకు చెందిన ప్రముఖ నేత కాష్ పటేల్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 22న జరిగిన ఈ భయానక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత్‌తో పాటు అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఈ దాడి గురించి కాష్ పటేల్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ, "కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి బాధితులందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. భారత ప్రభుత్వానికి మా పూర్తి మద్దతు కొనసాగుతుంది" అని పేర్కొన్నారు. "ఉగ్రవాద రూపంలో ప్రపంచం నిరంతరం ఎదుర్కొంటున్న ముప్పులకు ఇది నిదర్శనం. బాధితుల కోసం ప్రార్థిద్దాం. ఇలాంటి క్లిష్ట సమయాల్లో స్పందించే భద్రతా బలగాలకు ధన్యవాదాలు" అని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ కూడా ఈ దాడిని ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం తెలిపారు. "ఈ దారుణమైన దాడికి బాధ్యులైన వారిని వేటాడే క్రమంలో మేము మీకు మద్దతుగా ఉంటాం" అని తులసి గబ్బార్డ్ ఎక్స్ లో పేర్కొన్నారు.

పహల్గామ్‌లో జరిగిన ఈ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) బాధ్యత వహించినట్లు సమాచారం.


More Telugu News