కుమార్తె నగ్న వీడియోల పేరుతో దంపతుల నుంచి రూ. 60 లక్షల వసూలు!

  • శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో ఘటన
  • వీడియోల తొలగింపునకు పలు దఫాలుగా రూ. 60 లక్షలు ఇచ్చామన్న మహిళ
  • ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో డీజీపీకి ఫిర్యాదు చేశామని వెల్లడి
  • మహిళ ఆరోపణల్లో వాస్తవం లేదంటున్న దంపతులు
  • తాము ఇచ్చిన రూ. 1.75 కోట్లు ఇవ్వాలని అడిగినందుకు కుట్ర పన్నారని ఆరోపణ
తమ కుమార్తె నగ్న వీడియోలు ఉన్నాయని బెదిరించి తమ నుంచి ఓ జంట రూ. 60 లక్షలు వసూలు చేసిందని ఆరోపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురానికి చెందిన ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. రూ. 60 లక్షలు ఇచ్చినా ఇంకా వేధిస్తూనే ఉన్నారని ఉన్నారని, డబ్బులు ఇవ్వకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఖాళీ చెక్కులపై తమతో సంతకం కూడా చేయించుకున్నారని ఆరోపించారు. 

పోలీసుల కథనం ప్రకారం.. హిందూపురం స్టేట్‌బ్యాంక్ కాలనీకి చెందిన జయలక్ష్మి, మరో మహిళ చాలా కాలంగా స్నేహంగా ఉంటున్నారు. ఈ క్రమంలో తన కుమార్తె క్రికెట్ ఆడేందుకు ఇటీవల వేరే ఊరు వెళ్లగా అక్కడ కొందరు ఆమె నగ్న వీడియోలు చిత్రీకరించారని, డబ్బులు ఇస్తే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పి విజయలక్ష్మి, ఆమె భర్త వెంకటేశ్ కలిసి పలు దఫాలుగా తన నుంచి రూ. 60 లక్షలు తీసుకున్నారని మహిళ ఆరోపించారు. అయినప్పటికీ ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మేమే  రూ. 1.75 కోట్లు ఇచ్చాం
నగ్న వీడియోలు అంటూ మహిళ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని జయలక్ష్మి, ఆమె భర్త చెబుతున్నారు. వ్యాపారం కోసమని ఆమే తమ వద్ద నుంచి పలు దఫాలుగా రూ. 1.75 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. డబ్బుల కోసం అడిగితే చెల్లని చెక్కులు ఇచ్చారని, వాటిపై ఫిబ్రవరిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఆమె రాయబారం పంపారని, అందుకు అంగీకరించకపోవడంతోనే ఈ కుట్ర పన్నారని జయలక్ష్మి, ఆమె భర్త ఆరోపించారు.


More Telugu News